అది అంబేడ్కర్‌ స్ఫూర్తికి విరుద్ధం 

2 Jan, 2023 02:24 IST|Sakshi
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విద్యాసాగర్‌రావు, జూలురు, బి.వినోద్‌కుమార్‌ తదితరులు 

ఆస్తిక, నాస్తిక వైరుధ్యంపై మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు

నైతిక విలువలు పెంచేలా సిలబస్‌ మారుస్తాం: బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌  

ముగిసిన పుస్తక ప్రదర్శన 

సాక్షి, హైదరాబాద్‌: భారతదేశం అనాదిగా నాస్తిక, అస్తిక వాదాలకు నిలయంగా ఉందని, అయితే ప్రస్తుత పరిస్థితులు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు అన్నారు. నగరంలోని కళాభారతిలో 10 రోజులపాటు కొనసాగిన హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ముగింపు సభ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విద్యాసాగర్‌రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ పాల్గొన్నారు.

విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగం ద్వారా సమతా స్ఫూర్తిని ప్రజలమధ్య నింపడానికి కృషిచేశారని, నాస్తికులు, ఆస్తికులు పోట్లాడుకుని జైళ్లకు వెళ్లడం అంబేడ్కర్‌ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. అప్పటి సామాజిక విధానాల్లో ఉన్న అస్పృశ్యతను తొలగించడానికి అంబేడ్కర్‌ బౌద్ద మతాన్ని స్వీకరించి, అందులోని విధానాల ద్వారానే సౌభాతృత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. వీటికి సంబంధించిన విజ్ఞానం లభించాలంటే ఇలాంటి పుస్తక ప్రదర్శనలు అవసరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహన్ని తయారుచేయించడం అభినందనీయమని పేర్కొన్నారు.  

గ్రామ స్థాయిలో గ్రంథాలయాలు: ఇంటర్నెట్‌తో పిల్లల్లో వచ్చిన మార్పులు చూశాక అందోళన అనిపించినా ఇలాంటి పుస్తక ప్రదర్శన ద్వారా ఆ భయాలు తొలగిపోయాయని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. నైతిక విలువలు పెంపొందించే విధంగా విద్యావిధానం ఉండాలని తెలిపారు. హైదరాబాద్‌లో 100 స్కూళ్లను పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకొని సిలబస్‌ మార్చే విధంగా కృషి చేస్తున్నామని, అందులో నీతి కథలు, పర్యావరణం, వ్యక్తిత్వ నిర్మాణం పాఠ్యాంశాలుగా చేర్చబోతున్నామని పేర్కొన్నారు. భిన్న వాదనలు ఉన్నా పుస్తకం మనుషులను ఏకం చేస్తుందని బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆయా చితం శ్రీధర్, రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ రావుల శ్రీధర్‌రెడ్డి, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ సోమ భరత్‌ కుమార్, బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి, ఓయూ ప్రొఫెసర్‌ కొండ నాగేశ్వర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు