ఇందిరాపార్కులో.. లాహిరి లాహిరి 

17 Feb, 2022 02:21 IST|Sakshi

బోటు షికారు ఏర్పాటు చేయనున్న జీహెచ్‌ఎంసీ 

సాక్షి, సిటీబ్యూరో: వివిధ థీమ్‌లతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆకర్షణీయంగా, ప్రజలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్న జీహెచ్‌ఎంసీ తగిన సదుపాయాలున్న చోట ప్రత్యేకాకర్షణలు కలి్పంచేందుకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు అందుబాటులో ఉండి.. కొంతకాలంగా మరుగున పడిన సదుపాయాలను తిరిగి పునరుద్ధరించే చర్యలు చేపడుతోంది. ఇలాంటి వాటిల్లో భాగంగా ఇందిరాపార్కులో ఒకప్పుడుండి కొంతకాలంగా లేని బోటింగ్‌ షికారును తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది.

ముఖ్యంగా వేసవిలో చల్లని నీటి మధ్య బోట్‌ షికారు సరదాగా ఉంటుంది కనుక పార్కుకు వచ్చేవారికి  ఆహ్లాదంగానూ ఉంటుందని భావించి వచ్చే వేసవిలోగా బోటు షికారు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. బోటు షికాకు ధరలను కూడా ఖరారు చేసి ఔత్సాహికులైన కాంట్రాక్టర్లు ఇందిరాపార్కు కొలనులో వాటి విహారానికి ఏర్పాట్లు చేసుకునేందుకు టెండర్లు పిలిచినట్లు సంబంధిత అధికారి పేర్కొన్నారు.

పెడల్, మోటార్‌ రెండు రకాల బోట్లు కాంట్రాక్టరు అందుబాటులో ఉంచవచ్చని, 20 నిమిషాల షికారుకు పెడల్‌ బోటుకు రూ.30, మోటార్‌ బోటుకు రూ.50గా గరిష్ఠ ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే రద్దీని బట్టి  ఇంకా తక్కువ చార్జీనైనా వసూలు చేసుకోవచ్చు కానీ, అంతకుమించి గరిష్టంగా వసూలు చేయడానికి వీలుండదన్నారు.    

మరిన్ని వార్తలు