గోదా‘వర్రీ’.. పవిత్ర జలాలు అపవిత్రం

2 Oct, 2020 02:10 IST|Sakshi
భద్రాచలంలో గోదావరి నది ఒడ్డున చెత్త డంప్‌ 

బాసర నుంచి భద్రాచలం దాకా కలుషితమవుతున్న గోదావరి జలాలు

పనిచేయని మురుగునీటి శుద్ధి ప్రక్రియ ప్లాంట్లు..

రామగుండం కార్పొరేషన్‌ నుంచి భారీగా కలుస్తున్న మురుగునీరు

మహారాష్ట్రలోని లిక్కర్‌ ఫ్యాక్టరీ వ్యర్థాలూ ఆ జలాల్లోనే..

భద్రాచలంలో డంపింగ్‌ యార్డ్‌ లేక గోదావరిలోనే నిత్యం 11 టన్నుల చెత్త  

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : పవిత్ర గోదావరి జలాలు కలుషితమవుతున్నాయి. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే నీళ్లు మురుగును తలపిస్తున్నాయి. పరీవాహకం వెంట ఉన్న ఫ్యాక్టరీలు.. నగర శివారు ప్రాంతాల్లోని వ్యర్థాలన్నీ గోదావరిలో సమ్మిళితం కావడంతో నదీ పవిత్రతను కోల్పోతోంది. రాష్ట్రంలో నిర్మల్‌ జిల్లా బాసర పుణ్యక్షేత్రం వద్ద మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన దివ్యక్షేత్రం భద్రాచలం వద్ద ఏపీలోకి వెళ్తోంది. ఈ మధ్య ప్రాంతంలో 465 కిలోమీటర్ల మేర ప్రవహించే గోదావరిలోకి పలు చోట్ల భారీగా చెత్తా చెదారం చేరుతోంది. మురుగు నీటిని నేరుగా గోదావరిలోకి వదులుతుండటంతో పవిత్ర జలాలు అపవిత్రం అవుతున్నాయి.

గోదావరిలో కలిసే అన్ని ఉపనదులు దట్టమైన అటవీ ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ వస్తుండటంతో ఔషధ విలువలు ఉండాల్సిన జలాలు కాస్తా కాలుష్యమయం అవుతున్నాయి. దీంతో పర్యా వరణానికి హాని కలుగుతుండటంతో పాటు జం తువులు, వన్యప్రాణులు సైతం ఆ నీరు తాగి మృత్యువాత పడుతున్నాయి. బాసర, ధర్మపురి, మంచిర్యాల, రామగుండం, మంథని, భద్రాచలం పట్టణాల నుంచి ప్రతిరోజూ మురుగునీటిని శుద్ధి చేయకుండానే నేరుగా గోదావరిలోకి వదులుతున్నారు. 

మారని పరిస్థితి..
గోదావరి జలాల్లోకి నేరుగా ఒక్క చుక్క మురుగు నీరు వదలొద్దని.. ఎన్ని కోట్లు ఖర్చయినా మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ గతంలో ఆదేశించారు. అయినప్పటికీ పరిస్థితి మారకపోగా మరింత అధ్వానంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తిపోతల పథకాలు నిర్మించి రివర్స్‌ పంపింగ్‌ చేస్తోంది. దీంతో కలుషిత నీరు బ్యారేజీల్లోకి చేరి నీటిలోని జలచరాలు అంతరించిపోయే పరిస్థితి నెలకొంది. అలాగే ఈ నీటిని తాగేందుకు ఉపయోగిస్తే ప్రమాదకరమైన జబ్బుల బారిన పడే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ఇటువంటి పరిíస్థితుల్లో ఎస్‌టీపీల (మురుగునీటి శుద్ధి ప్రక్రియ ప్లాంట్లు) ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

పని చేయని ప్లాంట్లు..
రాష్ట్రంలో గ్రేటర్‌ హైదరాబాద్, గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్ల తర్వాత అతిపెద్ద రామగుండం కార్పొరేషన్‌ నుంచి ప్రతిరోజూ 32 మిలియన్‌ లీటర్ల మురుగునీరు గోదావరిలో కలుస్తోంది. ఈ నీటిని ఏమాత్రం శుద్ధి చేయకుండా వదిలిపెడుతుండటంతో గోదావరి మురికికూపంగా మారుతోంది. రామగుండం శివారులో నిర్మించిన ఎస్‌టీపీ ప్లాంట్‌లో 4 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్స్‌ ఫర్‌ డే) వ్యర్థ జలాలను శుద్ధి చేయాలి. అయితే అది పనిచేయడం లేదు. అలాగే 8 ఎకరాల్లో నిర్మించిన మల్కాపూర్‌ ఎస్‌టీపీ ప్లాంట్‌ ద్వారా ప్రతిరోజూ 14 మిలియన్‌ లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేయాలి.. ప్రస్తుతం అది కూడా పనిచేయడం లేదు. అలాగే కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన 14 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన సుందిళ్ల ఎస్‌టీపీ ప్లాంట్‌ నిర్మాణం మధ్యలోనే నిలిచింది. దీంతో ఇందుకు కేటాయించిన నిధులూ వృథా అయ్యాయి. రామగుండం కార్పొరేషన్‌ నుంచి వచ్చే వ్యర్థ జలాలతో పాటు ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ఇతర హానికరమైన రసాయన వ్యర్థాలు గోదావరిలో 18 మిలియన్‌ లీటర్లు కలుస్తున్నాయి.

కాగా.. రూ.90 కోట్లతో 21 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీని ద్వారా శుద్ధి చేసిన నీటిని ఎన్టీపీసీకి అందించాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. అయితే దీనికి ఇంకా అనుమతులు లభించలేదు. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీటి రివర్స్‌ పంపింగ్‌ కారణంగా ముంపునకు గురవుతున్న మల్కాపూర్‌ ఎస్‌టీపీ ప్లాంట్‌ స్థానంలో రూ.15.80 కోట్లతో మరో ప్లాంట్‌ నిర్మించాలని రామగుండం కార్పొరేషన్‌ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులకు ప్రతిపాదించారు. దీనిపై ఎలాంటి ముందడుగు పడలేదు.

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు..
రామగుండంలో 8 ఎంఎల్‌డీ, మల్కాపూర్‌ శివార్లలో 21 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన 2 ఎస్‌టీపీ ప్లాంట్లకు ప్రతిపాదనలు పంపాం. లేటెస్ట్‌ టెక్నాలజీ వాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. టెండర్ల ప్రక్రియ నడుస్తోంది. – పి.ఉదయ్‌కుమార్, కమిషనర్, రామగుండం కార్పొరేషన్‌

రోజూ 11 టన్నుల చెత్త నదిలోనే..
భద్రాచలంలోని 64 కాలనీల నుంచి ప్రతిరోజూ ఉత్పత్తవుతున్న 11 టన్నుల తడి, పొడి చెత్తను దేవస్థానానికి సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక భాగంలో గోదావరి కరకట్ట లోపల నది పారుతున్న చోటే వేస్తున్నారు. దీంతో నదిలోని నీరు కాలకూట విషంలా మారుతోంది. భద్రాచలం పట్టణం మినహా మండలంలోని మిగిలిన గ్రామాలన్నీ పోలవరం ముంపు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. భద్రాచలం చుట్టూ ఏపీ గ్రామాలే ఉన్నాయి. చివరకు భద్రాచలం ఆలయ భూములు 950 ఎకరాలు సైతం ఏపీలోకే వెళ్లాయి. దీంతో పట్టణానికి డంపింగ్‌ యార్డుకు కూడా స్థలం లేకుండా పోయింది. ఈ క్రమంలో గోదావరికి ఇవతలి ఒడ్డున ఉన్న బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీలోని భాస్కర్‌నగర్, గాంధీనగర్‌ వద్ద భద్రాచలం డంప్‌ యార్డ్‌ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేయగా.. సారపాక వాసులు వ్యతిరేకిస్తున్నారు.

ఇటీవల జరిగిన బూర్గంపాడు మండల ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశంలో పినపాక ఎమ్మెల్యే, విప్‌ రేగా కాంతారావు సైతం ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో ప్రస్తుతానికి భద్రాచలం వద్ద గోదావరి నదీగర్భమే డంపింగ్‌ యార్డులా మారింది. ఇచ్చట చెత్త వేస్తే శిక్షార్హులని బోర్డు ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీయే ఆ బోర్డు వద్ద చెత్తను డంప్‌ చేస్తుండటం గమనార్హం. ఈ విషయమై పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు కొత్తగూడెం ఇన్‌చార్జ్‌ ఈఈ బి.శంకర్‌బాబును వివరణ కోరగా.. పరిశీలించి భద్రాచలం గ్రామపంచాయతీపై చర్యలు తీసుకుంటామన్నారు.

సందట్లో సడేమియాలా..
రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌లో ఉన్న పయనీర్‌ లిక్కర్‌ ఫ్యాక్టరీ వారు వ్యర్థాలను గోతుల్లో నిల్వ చేసి జూలైలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన సమయంలో సందట్లో సడేమియాలా వ్యర్థాలను గోదావరిలోకి వదులుతుంటారు. ఇక మంచిర్యాల జిల్లా కేంద్రం వద్ద ఉన్న 3 ఎస్‌టీపీ ప్లాంట్లు పనిచేయడం లేదు. దీంతో మురుగునీరు వాగుల ద్వారా నేరుగా గోదావరిలో కలుస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం నుంచి మురుగు నీరు నేరుగానే గోదావరిలో కలుస్తోంది. ఇక్కడ ఎస్‌టీపీ ప్లాంట్‌ కోసం రూ.18 కోట్లతో ప్రభుత్వానికి ప్రతాపాదనలు పంపారు. ఇటు పెద్దపల్లి జిల్లా మంథని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణాల నుంచి కూడా మురుగునీరు శుద్ధి చేయకుండానే నేరుగా గోదావరిలో కలుపుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా