భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఈ ఏడాది పది లక్షల అమెరికా వీసాలు

20 Apr, 2023 04:17 IST|Sakshi

ఈ ఏడాది ఇస్తామన్నఅమెరికా కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌

విద్యార్థి వీసాలకు ప్రాధాన్యం 

వారు సకాలంలో కోర్సులో చేరేందుకు వీలుగా చర్యలు 

హైదరాబాద్‌ కార్యాలయంలో సిబ్బంది పెంపు 

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఓ శుభవార్త. ఈ ఏడాది దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయంతోపాటు 4 కాన్సుల్‌ జనరల్‌ ఆఫీసుల ద్వారా పది లక్షల కంటే ఎక్కువ వీసాలు జారీ చేయనున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ ప్రకటించారు. అలాగే, హైదరాబాద్‌ కాన్సుల్‌ జనరల్‌ కార్యాలయంలోనూ తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు.

హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలో ఇటీవల ప్రారంభించిన అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కొత్త కార్యాలయంలో జెన్నిఫర్‌ లార్సన్‌ ఇతర అధికారులతో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోవిడ్‌ కారణంగా మందగించిన వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు తీసుకున్న చర్యల గురించి వివరించారు. విద్యార్థి వీసాల జారీకి ప్రాధాన్యమిస్తున్నామని, సకాలంలో వారు కోర్సుల్లో చేరేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  

వీసాల జారీకి ఓవర్‌టైమ్‌: హైదరాబాద్‌ కార్యాలయంలో వీసా అధికారులను గణనీయంగా పెంచినట్లు కాన్సులర్‌ వ్యవహారాల చీఫ్‌ రెబెకా డ్రామే తెలిపారు. తాత్కాలిక కాన్సుల్‌ జనరల్‌ కార్యాలయం పైగా ప్యాలెస్‌లో ఉన్నప్పుడు ఒక్క రోజులో గరిష్టంగా 1,100 వీసాలు/ఇతర లావాదేవీలు ప్రాసెస్‌ చేసే సామర్థ్యం ఉండగా, కొత్త కార్యాలయంలో ఈ సామర్థ్యం 3,500 వరకూ ఉంటుందన్నారు. పైగా ప్యాలెస్‌ కార్యాలయంలో 16 కౌన్సిలర్‌ విండోస్‌ ఉండగా,  కొత్త కార్యాలయంలో 54 ఉన్నాయని తెలిపారు.

వీసాల్లో మార్పులు చేసుకునేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న డ్రాప్‌బాక్స్‌ సౌకర్యాన్ని కూడా మరింత విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి వీసాలపై మాట్లాడుతూ.. అమెరికాలో విద్యాభ్యాసానికి తొలిసారి దరఖాస్తు చేసుకున్న వారికి పాఠాలు మొదలయ్యే సమయానికి అక్కడ ఉండేలా చూసేందుకు ప్రయతి్నస్తామని వివరించారు. వీలైనంత ఎక్కువ సంఖ్యలో వీసాల జారీకి అధికారులతో ఓవర్‌టైమ్‌ చేయించేందుకూ ప్రయత్నిస్తున్నామని, ఇందుకు సంబంధించిన అనుమతులు లభించాయన్నారు. అలాగే వచ్చే వారం రెండు రోజులపాటు అదనపు వీసాల జారీకి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 

విద్యార్థులకు ఉచిత కౌన్సెలింగ్‌ 
అమెరికాలో విద్యనభ్యసించే విద్యార్థులు తగిన కోర్సు, విద్యాసంస్థలను ఎంచుకునేందుకు అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కార్యాలయం సహాయ సహకారాలు అందిస్తోందని పబ్లిక్‌ అఫైర్స్‌ ఆఫీసర్‌ డేవిడ్‌ మోయర్‌ తెలిపారు. యూఎస్‌–ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ ద్వారా ఉచిత కౌన్సెలింగ్‌ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

జూబ్లీహిల్స్‌లోని వై–యాక్సిస్‌ ఫౌండేషన్‌ కార్యాలయంలో ఎడ్యుకేషన్‌ యూ ఎస్‌ఏ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ కౌన్సెలింగ్‌ జరుగుతుందని, ఆసక్తి, అర్హతల ఆధారంగా అమెరికాలోని మొత్తం 4,500 విద్యాసంస్థల్లో తగిన దాన్ని ఎంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. ఈ సమావేశంలో మేనేజ్‌మెంట్‌ ఆఫీసర్‌ ఆడ్రీ మోయర్, పొలిటికల్‌ ఎకనమిక్‌ సెక్షన్‌ చీఫ్‌ సీన్‌ రూథ్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు