-

స్వయంగా తీసుకెళ్లి సచివాలయమంతా చూపించి..

26 Aug, 2023 04:31 IST|Sakshi
శుక్రవారం సచివాలయం ప్రాంగణంలో ప్రార్థనా మందిరాలను ప్రారంభించి నల్లపోచమ్మ అమ్మవారి గుడిలో పూజలు నిర్వహిస్తున్న గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌

నల్ల పోచమ్మ గుడిలో తొలిపూజ.. చర్చి, మసీదులలో తొలి ప్రార్థనలు 

కార్యక్రమాల్లో కలసి పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ 

సచివాలయంలో ప్రార్థనా మందిరాలు ప్రారంభం

అంతకుముందు తమిళిసైని సాదరంగా ఆహ్వనించిన కేసీఆర్‌ 

తన చాంబర్‌లో శాలువాతో సత్కారం 

సాక్షి, హైదరాబాద్‌: నూతన సచివాలయంలో ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న నల్ల పోచమ్మ ఆలయం, మసీదు, చర్చిలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో కలసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఆలయంలో జరిగిన తొలి పూజలు, మసీదు, చర్చిలలో నిర్వహించిన తొలి ప్రార్థనల్లో ఇరువురు కలసి పాల్గొన్నారు. గవర్నర్‌ సచివాలయానికి తొలిసారి వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా దగ్గరుండి ప్రత్యేకతలను చూపించారు. కొత్త సచివాలయం నిర్మాణంలో భాగంగా నల్ల పోచమ్మ ఆలయం, మసీదులను తొలగించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ రెండింటితోపాటు చర్చిని కూడా కొత్తగా, విశాలంగా నిర్మించారు. శుక్రవారమే వాటిని ప్రారంభించి అందరినీ అనుమతిస్తున్నారు. 

 చర్చిలో కేక్‌ను కట్‌ చేస్తున్న గవర్నర్‌ తమిళిసై. చిత్రంలో సీఎం కేసీఆర్, సీఎస్‌ శాంతి కుమారి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బాల్క సుమన్‌ తదితరులు
 చర్చిలో కేక్‌ను కట్‌ చేస్తున్న గవర్నర్‌ తమిళిసై. చిత్రంలో సీఎం కేసీఆర్, సీఎస్‌ శాంతి కుమారి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బాల్క సుమన్‌ తదితరులు

గవర్నర్‌ను ఘనంగా స్వాగతించి.. 
శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌.. ఆలయం, మసీదు, చర్చిల ప్రారంబోత్సవ ఏర్పాట్లు, సచివాలయ అంశాలపై ఉద్యోగ సంఘం నేతలతో కాసేపు మాట్లాడారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న గవర్నర్‌ తమిళిసైకు మేళతాళాల మధ్య సీఎం, సీఎస్‌ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం నుంచి జరుగుతున్న చండీయాగం పూర్ణాహుతిలో గవర్నర్, సీఎం పాల్గొన్నారు.

తర్వాత ఆలయంలో నల్ల పోచమ్మ అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. దీనికి అనుబంధంగా నిర్మించిన శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలనూ దర్శించుకున్నారు. తర్వాత ఎలక్ట్రిక్‌ వాహనంలో వారు చర్చి వద్దకు చేరుకున్నారు. గవర్నర్‌ తమిళిసై రిబ్బన్‌ కట్‌ చేసి చర్చిని ప్రారంభించారు. కేక్‌ కట్‌ చేసి బిషప్‌ డానియేల్‌కు, సీఎంకు అందించారు.

తర్వాత బిషప్‌ ఆధ్వర్యంలో తొలి ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణ క్రిస్టియన్‌ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీ కాంతి వెస్లీ ముఖ్యమంత్రికి జ్ఞాపికను బహూకరించారు. తర్వాత వారంతా పక్కనే ఉన్న మసీదుకు చేరుకున్నారు. అక్కడ ఇమాం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం మతపెద్దలు, మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌లతో కలసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం ప్రసంగించాలని అసదుద్దీన్‌ కోరగా.. ‘‘రాష్ట్రంలో సోదరభావం ఇలాగే పరిఢవిల్లాలి. ఇందుకు ప్రభుత్వపరంగా మావంతు చొరవ చూపుతాం. కొత్త మసీదు అద్భుతంగా, నిజాం హయాంలో కట్టిన తరహాలో గొప్పగా రూపొందింది. ఇలా అన్ని మతాల ప్రార్థన మందిరాలు ఒక్కచోట ఏర్పాటైన తెలంగాణ సచివాలయం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది..’’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. 


సీఎం కేసీఆర్‌తో కలసి మసీదును ప్రారంభిస్తున్న తమిళిసై. చిత్రంలో హోంమంత్రి మహమూద్‌ అలీ తదితరులు

సచివాలయాన్ని గవర్నర్‌కు చూపిన కేసీఆర్‌ 
రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో కొత్త సచివాలయాన్ని నిర్మించినా.. ఇప్పటివరకు గవర్నర్‌ అందులో అడుగుపెట్టలేదు. శుక్రవారమే తొలిసారిగా అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రార్థన మందిరాల్లో కార్యక్రమాలు ముగిశాక సీఎం కేసీఆర్‌.. సచివాలయాన్ని తిలకించాలంటూ గవర్నర్‌ తమిళిసైని ఆహ్వనించారు. స్వయంగా దగ్గరుండి మరీ కొత్త భవనం ప్రత్యేకతలు, నిర్మాణంలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, ఇతర అంశాలను వివరించారు. తన చాంబర్‌కు తోడ్కొని వెళ్లి అక్కడ శాలువాతో సత్కరించారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కూడా కావటంతో.. గవర్నర్‌కు ప్రభుత్వ సీఎస్‌ శాంతికుమారి కుంకుమ దిద్ది సంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. అనంతరం వారంతా తేనీటి విందులో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు