కేసీఆర్‌ను అన్నలా భావించా.. గవర్నర్‌ తమిళిసై భావోద్వేగం

7 Apr, 2022 20:36 IST|Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లి రాజ్‌భవన్‌లో చనిపోయిన సందర్భంలో కనీసం ముఖ్యమంత్రి చూడటానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని, రాష్ట్రపతి పరామర్శించారు కానీ కేసీఆర్‌ కనీసం ఫోన్ ఎత్తలేదన్నారు. తెలంగాణ వ్యవహరాల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌ షా అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. డ్రగ్స్ వాడకం యువతను నాశనం చేస్తుందన్న తమిళిసై.. ఒక తల్లిగా బాధపడుతూ దీనిపై ప్రధానికి నివేదిక ఇచ్చానని వెల్లడించారు.

కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో గవర్నర్‌ గురువారం భేటీ అనంతరం తమిళిసై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.. ఆమె మాట్లాడుతూ.. మహిళ అనే చిన్నచూపుతో అవమానాలకు గురిచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సోదరిగా కూడా చూడడం లేదని.. గవర్నర్‌ వ్యవస్థకైనా గౌరవం ఇవ్వాలన్నారు. తాను కేసీఆర్‌ను అన్నగా సంబోధిస్తానని, కానీ ఆయన మాత్రం తన పట్ల చిన్నచూపుతో వ్యవహరిస్తున్నారని వాపోయారు.
చదవండి: గవర్నర్‌తో వివాదంపై స్పందించిన కేటీఆర్‌.. ఏమన్నారంటే!

కరుణానిధి, జయలలిత, మమత బెనర్జీలాంటి వారు గవర్నర్లను విభేదించినా.. ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిచేవారని గుర్తు చేశారు. తెలంగాణలో హాస్పిటల్ పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని, యూనివర్సిటీల్లో 60 శాతం ఖాళీలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారుపై చర్యలు తీసుకునే అధికారం ఉంది కానీ నేను అలా చేయనన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ఎలాంటి కోపం లేదని, తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు