గెస్ట్‌ లెక్చరర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

20 Aug, 2022 11:33 IST|Sakshi

యూత్‌ కాంగ్రెస్‌ నేతలు శివసేనారెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్‌ లెక్చరర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని యూత్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. వచ్చే సోమవారం కల్లా వారిని విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయాలని, లేదంటే మంగళవారం నుంచి రాష్ట్రంలోని జూనియర్‌ కళాశాలల ఎదుట ఆందోళనలు నిర్వహిస్తామని అల్టిమేటం జారీ చేసింది. అతిథి అధ్యాపకుల (గెస్ట్‌ లెక్చరర్లు)ను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి జి.హర్షవర్ధన్‌రెడ్డి శుక్రవారం ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఒమర్‌ జలీల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 

గతంలో రాష్ట్రవ్యాప్తంగా 1,654 మంది గెస్ట్‌ లెక్చరర్లు పనిచేసేవారని, ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు వారిని విధుల్లోకి తీసుకోలేదని ఆ వినతిపత్రంలో తెలిపారు. కళాశాలల్లో అధ్యాపకులే లేరని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులు ఎలా చేరతారని ప్రశ్నించారు. అలాగే గత విద్యా సంవత్సరంలో గెస్ట్‌ లెక్చరర్లకు మార్చి, ఏప్రిల్, మే నెల వేతనాలను కూడా వెంటనే విడుదల చేయాలన్నారు. అంతకుముందు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను కూడా కలిసిన శివసేనారెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ఆమెకు సమర్పించారు. 

మరిన్ని వార్తలు