సూర్యాపేటలో మేఘ గర్జన

17 Jan, 2022 03:29 IST|Sakshi
సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం మాచనపల్లిలో నీట మునిగిన మిర్చి 

10 గంటలపాటు ఏకధాటిగా కుంభవృష్టి

ఇళ్లలోకి చేరిన వరదనీరు

భారీగా దెబ్బతిన్న మిర్చి, టమాటా, ఇతర పంటలు

ఉమ్మడి వరంగల్‌లోనూ భారీ వర్షం

సాక్షి నెట్‌వర్క్‌: సూర్యాపేట, నల్లగొండ జిల్లాలతోపాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఇప్పటికే వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఈ వర్షాలకు కుదేలయ్యారు. సూర్యాపేట జిల్లాలో, ప్రధానంగా సూర్యాపేట పట్టణంలో శనివారం రాత్రినుంచి ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపిలేకుండా దాదాపు పదిగంటల పాటు వర్షం కురిసింది.

దీంతో సద్దుల చెరువు కట్ట అలుగు తెగిపోయింది. దీని కారణంగా పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. కొన్ని చోట్ల కార్లు కూడా నీటమునిగాయి. ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాల ఎదురుగా రోడ్డుపైకి భారీగా నీళ్లు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుమలగిరిలో ఈదురుగాలులకు 11 కేవీ విద్యుత్‌ స్తంభాలు 8 నేలకూలాయి. నెల్లిబండతండాలో వడగళ్ల వర్షానికి 30 ఎకరాల్లో టమాట, మిర్చి, ఇతర కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి.

నూతనకల్,మోతెలో ఏరిన మిర్చి వరదలో కొట్టుకుపోయింది. ఆత్మకూర్‌–ఎస్‌ మండలం నెమ్మికల్‌ దండుమైసమ్మ ఆలయానికి సమీపంలో సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై నుంచి భారీగా వరద నీరు ప్రవహించింది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు సరాసరి 226.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా సూర్యాపేటలో 145 మి.మీ.వర్షం పడింది.నల్లగొండ జిల్లా కట్టంగూరు, నకిరేకల్‌ మండలాల్లో భారీ వర్షం కురిసింది. 

ఉమ్మడి వరంగల్‌లో.. 
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి కురిసిన వర్షానికి మిర్చి, మొక్కజొన్న, కంది, టమాటా, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి కొట్టుకుపోయింది. వరంగల్‌ జిల్లా సంగెం మండలం పల్లారుగూడ, మొండ్రాయి, నల్లబెల్లి, నార్లవాయి గ్రామాల్లో కురిసిన వడగళ్ల వర్షానికి మిర్చి, మొక్కజొన్న, కంది, టమాటా, బొప్పాయి తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

హనుమకొండ జిల్లా పరకాల, ఆత్మకూరు, నడికూడ తదితర మండలాల్లో వడగళ్ల వర్షం కురిసి పంటలకు నష్టం వాటిల్లింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దెముత్తారం, అందుకుతండా, వెంచరామి, వరికోల్‌పల్లి గ్రామాల్లో వర్షానికి మిర్చి, మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం రెడ్యాతండా, కోమటికుంటతండా, బొత్తలతండాల్లో రైతులు కల్లాల్లో ఆరబోసిన మిర్చి నీటిలో కొట్టుకుపోయింది. ములుగు జిల్లా ఏటూరునాగారం కొండాయి, మల్యాల గ్రామాల్లో మిర్చి, మినుము, పెసర, బొబ్బెర, జనుముల పంట నీటి పాలైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జంపన్నవాగు ఉప్పొంగడంతో నీరంతా పంట చేలల్లోకి చేరింది. వెంకటాపురం మండల పరిధిలోని పాలెం ప్రాజెక్టుకు గండిపడింది.  

మరిన్ని వార్తలు