హరీశ్‌ పరీక్ష ఫలితాలు వెల్లడించండి

8 Sep, 2023 03:21 IST|Sakshi

విద్యార్థిపై డీబార్‌ ఎత్తివేత..

 ‘వాట్సాప్‌లో టెన్త్‌ ప్రశ్నపత్రం’ కేసులో విద్యార్థికి హైకోర్టులో ఊరట  

సాక్షి, హైదరాబాద్‌/కమలాపూర్‌: పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో బాధ్యుడిని చేస్తూ హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలలో చదువుతున్న దండెబోయిన హరీశ్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి చేసిన డీబార్‌ను హైకోర్టు ఎత్తివేసింది. అనంతరం ఇతర విద్యార్థులలాగానే హరీశ్‌కు అన్ని సర్టిఫికెట్లు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ఈ నెల 6న ఉత్తర్వులు జారీ చేసింది.

కమలాపూర్‌లోని బాలుర ఉన్నత పాఠశాల కేంద్రంలో పదో తరగతి పరీక్షల సందర్భంగా ఏప్రిల్‌ 4న హిందీ ప్రశ్నపత్రం బయటికి రాగా విద్యార్థి దండెబోయిన హరీశ్‌ను బాధ్యుడిని చేస్తూ అప్పటి డీఈఓ ఐదేళ్లపాటు డీబార్‌ చేశారు. దీంతో విద్యార్థి హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర ఉత్తర్వులతో మిగిలిన పరీక్షలు రాశాడు. అయినప్పటికీ ఫలితాల్లో హరీశ్‌ది విత్‌హెల్డ్‌లో పెట్టి మాల్‌ ప్రాక్టీస్‌ కింద చూపారు. దీంతో హరీశ్‌ మరోసారి తన ఫలితాలు ప్రకటించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు.

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సుదీర్‌కుమార్‌ బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. హరీశ్‌ పరీక్ష ఫలితాలను అధికారులు వెల్లడించకుండా విత్‌ హెల్డ్‌లో పెట్టారని, దీంతో అతను పైతరగతులకు వెళ్లడం ఇబ్బందిగా మారిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. హరీశ్‌ ఫలితాలు వెంటనే వెల్లడించడంతోపాటు సర్టిఫికెట్లన్నింటినీ అందజేయాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు ఉత్తర్వుల పట్ల హరీశ్‌తోపాటు అతని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 

కోర్టు చెప్పినా ఫలితాలు ప్రకటించడం లేదు: బల్మూరి 
పేపర్‌ లీకేజీ కేసులో అకారణంగా డీబార్‌ చేసిన విద్యార్థి హరీశ్‌ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ డిమాండ్‌ చేశారు. హైకోర్టు చెప్పినా హరీశ్‌ ఫలితాలు విడుదల చేయడం లేదని, మరో రెండు, మూడు రోజుల్లో ఇంటర్‌ అడ్మిషన్లు పూర్తవుతున్న తరుణంలోనైనా ప్రభుత్వం ఫలితాలు విడుదల చేసి హరీశ్‌కు న్యాయం చేయాలని కోరారు.

బీఆర్‌ఎస్, బీజేపీలు తమ రాజకీయ డ్రామాల కోసం హరీశ్‌ జీవితంతో ఆడుకుంటున్నాయని గురువారం గాం«దీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. కనీసం పదో తరగతి పేపర్‌ లీకేజీతో సంబంధం ఉందని అరెస్టు చేసిన అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కేసు ఏమైందో అయినా ప్రభుత్వం చెప్పాలని వెంకట్‌ ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు