బీఆర్‌ఎస్‌ను ఆగం చేస్తున్న వర్గపోరు.. ట్రబుల్‌ షూటర్‌ మంత్రం పనిచేస్తుందా?

20 Nov, 2023 14:13 IST|Sakshi

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఓ సెంటిమెంట్‌ ఉంటుంది. ఓ ఆనవాయితీ కూడా ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ ఎస్‌సీ రిజర్వుడు సెగ్మెంట్‌ ఈసారి హాట్ హాట్‌గా మారింది. ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే అధికార పార్ఠీలో అంతర్గత కలహాలు అక్కడి అభ్యర్థిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం.

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం..ఒకప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో.. ప్రస్తుతం జనగామ జిల్లాలో కొనసాగుతోంది. రాజకీయాల్లో సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అలా ఈ నియోజకవర్గంకూ ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది.

1978లో ఎస్సీ రిజర్వుడుగా మారినప్పటి నుంచీ ఈ అనవాయితీ కొనసాగుతూ వస్తోంది. దీంతో జిల్లాలోని అన్ని పార్టీల నేతలంతా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడి నుంచి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఏడు సార్లు..టీడీపీ మూడు సార్లు.. గులాబీ పార్టీ ఉప ఎన్నికలతో సహా నాలుగుసార్లు విజయం సాధించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో తాడికొండ రాజయ్య గులాబీ పార్టీ తరపున విజయం సాధించి.. కేసీఆర్ తొలి క్యాబినెట్‌లో తొలి డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత  2018లో కూడా డాక్టర్ రాజయ్య బీఆర్ఎస్ నుంచి గెలిచారు. బీఆర్ఎస్‌ పార్టీకే రెండోసారి అధికారం దక్కింది. ఉపఎన్నికతో కలిపి వరుసగా 4 సార్లు రాజయ్య ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు సృష్టించారు.  అయితే ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం రాజయ్య చేజారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని గులాబీ బాస్ ఈసారి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి బిఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చారు. 

టికెట్ రాకపోవడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజయ్య అసంతృప్తి రగలిపోతున్నారు. రాజయ్య తీరుతో పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరికి నష్టమని గ్రహించిన కేటీఆర్‌.. సీఎం కేసీఆర్‌ స్వయంగా రాజయ్యతో మాట్లాడి బుజ్జగించారు. కడియంతో కలిసి పనిచేయమని రాజయ్యకు సూచించారు. పెద్దల ముందు తలాడించినా గాని...ఆ తర్వాత కూడా ఇద్దరు నేతల మధ్య పెద్దగా సఖ్యత లేకుండా పోయింది.

పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరితో రాజయ్య అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. మొదట్లో కడియం నిర్వహించిన అత్మీయ సమ్మేళనాలకు రాజయ్య హాజరుకాలేదు. ఘన్‌పూర్ నియోజకవర్గంలో కడియం బలమైన నేతగా భావిస్తున్నా.. వర్గపోరు పార్టీని ఆగం చేస్తోందనే భావన అధిష్టానం దృష్టికి వెళ్లింది. ఇప్పటికే ఈ అంశాన్ని  విపక్షాలు క్యాష్ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాలు గులాబీ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయట..

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో జరగాల్సిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ అనూహ్యంగా వర్థనపేటకు మారింది. సభ నియోజకవర్గం మారడానికి ఘన్‌పూర్‌ పార్టీలో అంతర్గత కలహాలే కారణమంటూ ప్రచారం సాగింది. అక్కడి నుంచి వస్తున్న సర్వేలు సైతం గులాబీ పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయట.

ఒకవైపు ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్‌ కూడా ఉండటంతో బీఆర్ఎస్ నాయకత్వం ఘన్‌పూర్‌ సెగ్మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారంచాల్సి వస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మీద ఎటువంటి అవినీతి మరకా లేదు. అయితే రాజయ్య సీటును లాక్కున్నారనే విమర్శలు స్వపక్షం నుంచే కడియంకు ఎదురవుతున్నాయి. 

ఇదిలా ఉంటే..బీఆర్ఎస్‌లో ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్‌ను అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కడియం అభ్యర్థిత్వాన్ని  బలమైన మాదిగ సామాజిక వర్గం సైతం వ్యతిరేకిస్తే పార్టీకి ఇబ్బందిగా మారుతుందని భావిస్తున్నారట. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ట్రబుల్ షూటర్‌గా ఉన్న మంత్రి హరీష్ రావును రంగంలోకి దింపారని ప్రచారం జరుగుతోంది.

ఉద్యమ సమయంలో 2012 ఉప ఎన్నికల్లో సైతం హరీష్ రావు పూర్తి బాధ్యతలు తీసుకుని అప్పట్లో రాజయ్యను గెలిపించడానికి కృష్టిచేశారు. అప్పుడు ఎవరి ఓటమి కోసం పనిచేశారో అదే కడియం శ్రీహరి విజయం కోసం ఇప్పుడు మళ్లీ హరీష్ రావు రంగంలోకి దిగాల్సి వచ్చిందట. ఆత్మీయ సమ్మేళనం పేరుతో వచ్చిన హరిష్ రావు రాజయ్య ఇంటికి వెళ్లి నచ్చ చెప్పారు.

ట్రబుల్ షూటర్ హరీష్ రావు మంత్రాంగం పనిచేస్తుందా? రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్న కడియం శ్రీహరి కోసం రాజయ్య మనస్పూర్తిగా పనిచేస్తారా? అనే చర్చ ఘన్‌పూర్ నియోజకవర్గంలో సాగుతోంది. మరోవైపు ఇక్కడ ఉన్న సెంటిమెంట్ ఈ సారి నిజమవుతుందా? లేదా అనే చర్చ కూడా మొదలైంది. 
 

మరిన్ని వార్తలు