గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం

27 Aug, 2023 19:11 IST|Sakshi

హైదరాబాద్‌: వచ్చే నెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం ఉదయం 11.00 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో  డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు నగరానికి చెందిన మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి లు పాల్గొంటారు. అంతేకాకుండా బాలాపూర్, ఖైరతాబాద్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, సికింద్రాబాద్ YMCA గణేష్ ఉత్సవ సమితిలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గణేష్ మండపాల నిర్వహకులకు కూడా సమావేశానికి ఆహ్వానిస్తూ అధికారులు లేఖలను  పంపించారు. 

గణేష్ నవరాత్రుల నిర్వహణ లో దేశంలోనే హైదరాబాద్ నగరం ప్రత్యేకతను సంతరించుకుంది. అటువంటి గణేష్ నవరాత్రులను తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తర్వాత మరింత ఘనంగా నిర్వహించే విధంగా ప్రభుత్వం ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేస్తూ వస్తోంది. విగ్రహాల ప్రతిష్ట నుంచి నిమజ్జనం వరకు ఎక్కడా ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా శాంతిభద్రతల నిర్వహణ, శోభాయాత్ర, వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ వస్తోంది. ఈ సంవత్సరం కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

ఇదీ చదవండి: TS: డ్రగ్స్‌ కేసులో ఎస్‌ఐ రాజేందర్‌ అరెస్ట్‌

మరిన్ని వార్తలు