పార్టీల చరిత్ర చూసి ఓటేయండి: దేవరకద్ర ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్

6 Nov, 2023 16:43 IST|Sakshi

మహబూబ్‌ నగర్‌: ఓటేసే ముందు అన్ని పార్టీల చరిత్ర చూడాలని పాలమూరు ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపు ఇచ్చారు.  ఎవరో చెప్పారని ఓటు వేయొద్ధని.. ప్రజల వద్ద ఉన్న వజ్రాయుధం ఓటు అని అన్నారాయన. సోమవారం మధ్యాహ్నాం జిల్లాలోని దేవరకద్ర ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ నేడు పాల్గొన్నారు.  

గత ప్రభుత్వాల పాలనలో పాలమూరును ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించిన సీఎం కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన దేవరకద్ర అభివృద్ధితో తమ పార్టీ అభ్యర్థి వెంకటేశ్వర్‌రెడ్డి విజయం ఖాయమైపోయిందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘30 చెక్‌డ్యామ్‌లు మంజూరు చేయించిన నాయకుడు వెంకటేశ్వర్‌రెడ్డి. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి.. అభ్యర్థి వెనక ఉన్న పార్టీ విధానం చూసి ఓటు వేయండి’’ అని ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు. 

రాబోయే ఐదేళ్ల కాలం ప్రజల భవిష్యత్ నిర్ణయిస్తుందని, కాబట్టి విచక్షణతో ఓటు వేయాలని ప్రజలను కోరారు. అయితే ఇప్పటిదాకా కూడా ప్రజాస్వామ్యంలో మనం ఆశించిన పరిణితి రాలేదని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి: గెలిపిస్తేనే వస్తా.. లేదంటే రాను : కేటీఆర్‌

మరిన్ని వార్తలు