కేటీఆర్‌ని సోనూ సూద్‌ ఏమి కోరారో తెలుసా?

1 Jun, 2021 17:33 IST|Sakshi

ఈసారి హైదరాబాద్‌ వచ్చినపుడు కలుద్దాం

బిర్యానీ సిద్ధం చేయండి: సోనూ సూద్‌

సాక్షి, హైదరాబాద్‌: మీరు రియల్‌ హీరో, మీరే రియల్‌ హీరో అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఒకరినొకరు పొగుడుకున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, నటుడు సోనూసూద్‌ మధ్య మరింత స్నేహం బల పడుతోంది.  కరోనా మహమ్మారి నేపథ్యంలో మొదటినుంచీ వలసకార్మికులు మొదలు అపన్నులందరికీ అండగా నిలిచారు సోనూసూద్‌. అలాగే కరోనాకాలంలో, ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌ రాష్ట్రాన్ని పట్టి కుదుపుతున్న తరుణంలో మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా చాలామందికి సాయం అందిస్తూ.. తన సహచరులతో కలిసి 24 గంటలూ బాధితులకు అండగా నిలుస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఒక నెటిజనుడు కేటీఆర్‌ను ప్రశంసిస్తూ మీరు రియల్‌ హీరో అంటూ ట్వీట్‌ చేశారు. దీనికి ఒక ప్రజా ప్రతినిధిగా, మంత్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నానంటూ మంత్రి సమాధానం ఇచ్చారు. అంతేకాదు నిజానికి రియల్‌ హీరో సోనూసూద్‌ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా ట్విటర్‌లో సందడి నెలకొంది. దీనికి స్పందించిన సోనూ కాదు కాదు.. మీరే రియల్‌ హీరో అటూ కేటీఆర్‌ను అభినందించారు. కేటీఆరే నిజ‌మైన హీరో అని, ఆయన నాయ‌క‌త్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని సోనూ పేర్కొనడం విశేషం. ఆ తరువాత మీరు ప్రారంభించిన సేవా కార్యక్రమాలను కొనసాగించాలని.. లక్షలాదిమందికి ప్రేరణగా నిలుస్తున్నారంటూ సోనూని కేటీఆర్‌ కొనియాడారు. 

కేటీఆర్‌, సోనూ సూద్‌ల ట్విటర్‌ స్టోరీ ఇంతటితో ముగియలేదు. డియర్‌ బ్రదర్‌ ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలని ఆశపడుతున్నా. నా మిషన్‌ కొనసాగుతూనే ఉంటుంది.. మీరు చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారంటూ సోనూ సూద్‌ ట్వీట్‌ చేశారు. దీనికి సమాధానంగా.. ఎదురు చూస్తున్నా.. ఈసారి హైదరాబాద్‌ వచ్చినపుడు కలుద్దాం అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. అంతే దీనికి ఏమాత్రం తగ్గని సోనూసూద్‌... కేటీఆర్‌ను ఏమి కోరారో తెలుసా.. తనకు హైదరాబాద్‌ బిర్యానీ సిద్ధంగా ఉంచాలన్నారు. అంతేకాదు ముంబై నుంచి మంచి రుచికరమైన వంటకాలను తీసుకొస్తానని హామీ కూడా ఇచ్చారు. 

చదవండి:  అది నేను కాదు.. సోనూసూద్​: కేటీఆర్

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు