బీజేపీ సీనియర్‌ నేత భవర్‌లాల్‌ వర్మ మృతి

18 Apr, 2021 09:20 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సహ కోశాధికారి, మాజీ కార్పొరేటర్‌ భవర్‌లాల్‌వర్మ (63) సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో శనివారం ఉదయం మృతి చెందారు. కరోనా సోకడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. కరోనా తగ్గిపోయినా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ తగ్గకపోవడంతో ఎక్మో వెంటిలేటర్‌ సహాయంతో చికిత్స అందజేస్తూ వచ్చారు. అయితే శనివారం కార్డియాక్‌ అరెస్టు కావడంతో కన్ను మూశారు. ఆయనకు భార్య రామ్‌కన్యావర్మ, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భౌతిక కాయాన్ని రంగ్రేజీబజార్‌లోని ఆయన నివాసానికి తరలించగా పలువురు ప్రముఖులతో పాటు బీజేపీ కార్యకర్తలు, నాయకులు సందర్శించి నివాళులు అర్పించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాంగోపాల్‌పేట్‌ కార్పొరేటర్‌ చీర సుచిత్ర శ్రీకాంత్‌ తదితరులు నివాళులర్పించారు. సాయంత్రం కవాడీగూడలోని మార్వాడీ శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయన మృతికి హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. 


పార్టీకి తీరని లోటు: కిషన్‌రెడ్డి 
బీజేపీ సీనియర్‌ లీడర్‌గా ఎల్లవేళల్లా పార్టీ కోసం, కార్యకర్తల కోసం కొట్లాడే వ్యక్తి భవర్‌లాల్‌వర్మ. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి సమయంలోనైనా వెళ్లి ఆదుకునే వారు. కరోనాతో ఆయన అందరినీ వదలి వెళ్లిపోవడం దురదృష్టకరం. ఆయన మృతి బీజేపీ పార్టీకి, కార్యకర్తలకు తీరనిలోటు.

( చదవండి: బీజేపీకి అండగా టీఆర్‌ఎస్‌: ఉత్తమ్‌కు కేటీఆర్‌ ఫోన్ ‌)

మరిన్ని వార్తలు