Banjara Hills: దోమ తెరలు, బ్లాంకెట్ల సరాఫరా.. 60 కోట్ల కాంట్రాక్ట్‌ ఇప్పిస్తానని.. 

15 Feb, 2023 09:33 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: అస్సాంలోని దోమ తెరలు, బ్లాంకెట్‌ల సరఫరాకు సంబంధించి 60 కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ ఇప్పిస్తానని నమ్మబలికి 20 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. రహ్మత్‌నగర్‌కు చెందిన కె.నర్సింహారెడ్డి వ్యాపారి. ఆయనకు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కె.నారాయణతో పరిచయం ఉంది. కొద్ది రోజుల కిత్రం నారాయణ ద్వారా మాదాపూర్‌ జైహింద్‌ రోడ్డులో నివాసం ఉండే గుండుబోయిన వినయ్, కాకాని మనోహర్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది.

వీరిద్దరు తమకు వివిధ ప్రభుత్వాలతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. పెద్ద పెద్ద కాంట్రాక్ట్‌లు చేస్తుంటామని నమ్మించారు. అనంతరం అస్సాం రాష్ట్రంలో 60 కోట్ల రూపాయల విలువ చేసే దోమ తెరలు, బ్లాంకెట్‌లు సరఫరా చేసే కాంట్రాక్ట్‌ అప్పగింత పని తమ చేతిలో ఉందని తెలిపారు. ఎవరైన పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నర్సింహారెడ్డికి ఆశ కల్పించారు. ఆ తర్వాత కాంట్రాక్ట్‌ తామే తీసుకుంటున్నట్టు చెప్పడంతో కొంత పెట్టుబడి పెడితే వాటా ఇస్తామని చెప్పారు.

నర్సింహారెడ్డి వారి మాటలను నమ్మి 20 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ తరువాత వారిద్దరు మోసగాళ్లని తెలిసింది. తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని నర్సింహారెడ్డి ఇద్దరిని పలుమార్లు అడిగాడు. కాని వారు స్పందించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించగా జూబ్లీహిల్స్‌ పోలీసులు వినయ్, కాకాని మనోహర్‌రెడ్డిలపై ఐపీసీ 406,420, రెడ్‌ విత్‌ 34 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు