వేసవి మంటలు?.. అదే జరిగితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పైపైకి!

14 Feb, 2023 13:38 IST|Sakshi

ఎల్‌ నినో పరిస్థితులు ఏర్పడేందుకు చాన్స్‌..

ఈసారి అసాధారణ ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం

అమెరికా వాతావరణ పరిశోధన సంస్థ ప్రాథమిక అంచనా

సాక్షి, హైదరాబాద్‌: చలి తగ్గింది. మధ్యాహ్నం ఎండ.. అప్పుడే వేసవి వచ్చిందా? అన్నట్టుగా ఉంటోంది. ఈసారి ఎండలు మండిపోతాయా? అని కూడా అనిపిస్తోంది. అమెరికా వాతావరణ పరిశోధన సంస్థ జనవరి అంచనాలు కూడా వేసవి ఉష్ణోగ్రతలు మోత మోగిపోతాయని వెల్లడించడం ఆందోళన కలిగించే అంశం. వాస్తవానికి తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. దేశం మొత్తమ్మీద గత మూడేళ్లలో వర్షాలకు ఏమాత్రం కొదవ లేకుండా పోయింది.

అదే సమయంలో వేసవిలో విపరీతమైన వడగాడ్పులు వీచాయి. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో గత ఏడాది శీతాకాలం చలి వణికించింది. వాతావరణంలో వస్తున్న మార్పులకు ఇవన్నీ తార్కాణాలే. కాగా నాలుగేళ్ల విరామం తరువాత ఈ ఏడాది వేసవి సమయంలో ఎల్‌ నినో పరిస్థితులు ఏర్పడవచ్చని, ఎండలు అసాధారణంగా ఉండే అవకాశం ఉందని అమెరికా పరిశోధకులు స్పష్టం చేశారు.  

లా నినా నుంచి ఎల్‌ నినో వైపు? 
అమెరికాకు చెందిన నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్ఫరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌ఓఏఏ) ఈ ఏడాది వాతావరణంపై గత నెలలో ప్రాథమిక అంచనాలను వెలువరించింది. దాని ప్రకారం ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టుల్లో ఎల్‌ నినో పరిస్థితులు ఏర్పడేందుకు యాభై శాతం అవకాశం ఉండగా.. జూలై మొదలుకొని సెపె్టంబర్‌ వరకు ఏర్పడేందుకు 58 శాతం అవకాశాలున్నాయి. అదే జరిగితే నైరుతి రుతుపవనాలు దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. పసిఫిక్‌ మహా సముద్రంలో భూమధ్య రేఖ చుట్టుపక్కల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడాన్ని ఎల్‌ నినో అని పిలుస్తారు.

ఇదే ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గితే అది లా నినా అవుతుంది. కాగా దేశంలో గత మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురిసేందుకు కారణమైన లా నినా పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది ఎల్‌ నినో ఏర్పడేందుకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. అయితే కచి్చతంగా ఇలాగే జరుగుతుందని ఇప్పుడే చెప్పలేమని.. రానున్న మూడు నాలుగు నెలల్లో పరిస్థితులు మారినా మారవచ్చని వీరు అంటుండటం ఊరటనిచ్చే అంశం. ఎన్‌ఓఏఏ మాదిరిగానే భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) కూడా ఈ ఏడాది ఎల్‌ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశాలే ఎక్కువని  చెబుతోంది. అయితే ఎల్‌ నినో సీజన్‌ మొదలయ్యేందుకు ఇంకా మూడు నాలుగు నెలలు ఉన్నందున ఈ అంచనాలు తప్పు కావచ్చునని కూడా పేర్కొంది. కాగా ఈ నెలాఖరుకు తాజా అంచనాలను విడుదల చేస్తామని ఐఎండీ డైరెక్టర్‌ ఎం.మహాపాత్ర తెలిపారు.  

సమాచారం ఆందోళనకరమే: స్కైమెట్‌ 
ఈ ఏడాది ఎల్‌ నినో, లా నినా పరిస్థితులపై అందిన ప్రాథమిక సమాచారం ఆందోళనకరంగానే ఉందని దేశంలోనే తొలి ప్రైవేట్‌ వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్‌కు చెందిన మహేశ్‌ పలవట్‌ చెబుతున్నారు. ‘పరిస్థితులు లా నినా నుంచి ఎల్‌ నినో వైపునకు మారుతున్నాయంటేనే ప్రమాదం ముంచుకొస్తోందని అర్థం. రుతుపవనాల సమయంలో ఎల్‌ నినో ఏర్పడితే ఈ ఏడాది వర్షాలు తగ్గుతాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. 2020లోనే లా నినా పరిస్థితులు ఏర్పడి, ప్రస్తుతం కూడా అదే కొనసాగుతున్నా ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో ఉండటం, గత ఏడాది కొన్నిసార్లు విపరీతమైన వడగాడ్పులు నమోదు కావడం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫ్రిబవరి, మార్చిల్లోనూ ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం అసాధారణ స్థాయిలో ఉండవచ్చు..’ అని పలవట్‌ పేర్కొన్నారు.  

తగిన ఏర్పాట్లు చేసుకోమన్నాం.. 
మధ్యమ స్థాయి ఎల్‌ నినో రుతుపవనాలపై ప్రభావం చూపగలదు. దీనివల్ల కురిసే వర్షాల మోతాదు తగ్గుతుంది. కానీ ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రం రుతుపవనాలు సాధారణం కంటే తక్కువ స్థాయిలో ఉంటాయని చెప్పలేం. రానున్న మూడు నాలుగు నెలల్లో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల ఉపరితల జలాల ఉష్ణోగ్రతల్లో తేడాల ఆధారంగా రుతుపవనాల తీవ్రతలో తేడాలు రావచ్చు. మొత్తం మీద ఈ సారి ఎండలు తీవ్రంగానే ఉండబోతున్నాయి. ఇందుకు  తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించాం. 
– ఎం.రాజీవన్, ఎర్త్‌ సైన్స్‌ మంత్రిత్వ శాఖ కార్యదర్శి 

సగటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం 
ఉష్ణోగ్రతలు నమోదు చేయడం మొదలుపెట్టిన తరువాత అత్యధిక వేడి నమోదైన సంవత్సరాల్లో 2022ది ఐదో స్థానం. ఈ ఏడాది ఎల్‌ నినో పరిస్థితులు ఏర్పడితే ఈ రికార్డులు చెరిగిపోయే అవకాశం ఉంది. సగటు ఉష్ణోగ్రతలు శతాబ్దం క్రితంతో పోలిస్తే 1.5 డిగ్రీ సెల్సియస్‌ వరకు పెరగవచ్చునని అంచనా. గత ఏడాది భారత్‌లో కనీసం తొమ్మిది నగరాల్లో వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీ సెల్సియస్‌ కంటే ఎక్కువగా నమోదైన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఉత్తర, వాయువ్య, తూర్పు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులు రావచ్చని గత ఏడాది ఐఎండీ హెచ్చరించింది.  

సముద్ర జలాలు వెచ్చబడితే అధిక ఉష్ణోగ్రతలు 
 లా నినా పరిస్థితుల్లో తూర్పు నుంచి పశ్చిమం వైపు వీచే వాణిజ్య పవనాలు బలంగా ఉంటాయి. దీనివల్ల సముద్ర ఉపరితలంపై ఉండే వెచ్చటి నీరు పశి్చమ దిక్కుకు ఎక్కువగా కదులుతుంది. అదే సమయంలో సముద్రపు లోపలి భాగంలోని శీతల జల ప్రవాహాలు తూర్పువైపునకు ప్రయాణిస్తాయి. అధిక వర్షాలకు కారణమవుతాయి. ఎల్‌ నినోలో పరిణామాలు మాత్రం దీనికి వ్యతిరేక దిశలో ఉంటాయి. వాణిజ్య పవనాలు బలహీనపడి ఉపరితలంపైని వెచ్చటి నీరు తూర్పు దిక్కుకు అంటే మన వైపు ప్రయాణిస్తుంది. అప్పటికే చల్లగా ఉన్న నీటిని ఇవి వెచ్చబెడతాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఇండోనేసియా, ఆ్రస్టేలియాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గాల్లో తేమ శాతం తగ్గిపోతుంది. ఫలితంగా రుతుపవనాలు బలహీనపడిపోతాయి. కరువులు, కార్చిచ్చులు ఎక్కువవుతాయి.   

మరిన్ని వార్తలు