Hyderabad: నత్తనడకన సాగుతున్న డబుల్‌ బెడ్రూం నిర్మాణ పనులు

28 Sep, 2022 17:44 IST|Sakshi

ఆశలు కల్పించి సొంతిళ్లు ఖాళీ చేయించారు

ఇప్పటికీ పూర్తికాని డబుల్‌ బెడ్రూం గృహాలు

ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటూ అవస్థలు

ఆజాద్‌ చంద్రశేఖర్‌ నగర్, లాలాపేట సాయి నగర్‌ వాసుల ఇబ్బందులు 

తార్నాక డివిజన్‌ లాలాపేట సాయి నగర్‌లోని మురికివాడలో తాత్కాలిక నివాసాలు, గుడిసెల్లో నివాసాలుంటున్న సుమారు 107  కుటుంబాలను డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పేరిట ఖాళీ చేయించారు. మూడు బ్లాక్‌లతో కూడిన ఇళ్ల సముదాయ నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు ఒక్క బ్లాక్‌ కూడా పూర్తి కాలేదు. అక్కడి నివాసితులు  ఇతర ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో కిరాయిలు కట్టలేక ఇబ్బందుల మధ్య బతుకులీడుస్తున్నారు.   

నగరంలోని అడ్డగుట్ట డివిజన్‌ ఆజాద్‌ చంద్రశేఖర్‌ నగర్‌ మురికివాడలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం అక్కడి 42 నివాసాలను ఖాళీ చేయించారు. 2015లో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఇంద్రకరణ్‌ రెడ్డి చేతుల మీదుగా డబుల్‌ బెడ్రూం ఇళ్ల సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడేళ్లుగా వీటి నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 80 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో పేద  కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో కిరాయి ఇళ్లలో ఉంటూ అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నాయి. 

సాక్షి, హైదరాబాద్: గూడు కోసం నిరుపేదల ఏడేళ్లుగా నిరీక్షిస్తున్నారు. మురికివాడల రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిదేందుకు పేదల నివాసాలను ఖాళీ చేయించి అక్కడే చేపట్టిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు నత్తలకు నడక నేర్పిస్తున్నాయి. అయిదారేళ్లుగా ఇంటి అద్దె భారమై పేదలు నానా అవస్థలు పడుతున్నారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల ఆశలు అడియాసలుగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2015లో రెండు పడకగల గదుల ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. కానీ ఆశించిన రీతిలో ఇళ్ల నిర్మాణం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. 


40 ప్రాంతాలు.. 8,898 గృహాలు 

హైదరాబాద్‌ మహానగరంలో సుమారు రెండు లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా, తొలి దశలో లక్ష గృహాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను ప్రభుత్వం సేకరించింది. వాటిలో స్లమ్స్‌లోని పేదలు నివసిస్తున్న ఇరుకు ఇళ్లను కూల్చివేసి 40 ప్రాంతాల్లో ఇన్సిటూ పద్ధతిలో 8,898 ఇళ్ల నిర్మాణం చేపట్టారు.  ఇప్పటికే  సింగం చెరువు తండా, చిత్తారమ్మ బస్తీ, కిడ్‌ కీ బాత్‌ అలీషా, సయ్యద్‌ సాబ్‌ కా బాడా, ఎరుకల నాంచారమ్మ బస్తీ, జియాగూడ, కట్టెలమండి, గోడే కీ ఖబర్‌ తదితర 25 ప్రాంతాల్లో రెండు పడక గదుల ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించారు. కొన్ని  ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల పనులు జరగనందునే జాప్యం ఏర్పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. 

అయిదేళ్లలో రూ.3.5 లక్షలపైనే .. 
నగరంలోని మురికి వాడల సమీపంలో  నివాసాలకు నెలసరి అద్దె  కనీసం అయిదు వేల రూపాయల వరకు ఉంది. అద్దెలన్నీ లెక్కిస్తే అయిదేళ్లలో చెల్లించింది రూ.3.5 లక్షలపైనే ఉంటుంది. ఇంటి అద్దె తలకుమించిన భారంగా మారడంతో పేద కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులందకపోవడంతోనే పనులు కుంటుపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అద్దెలు చెలించలేక అవస్థలు పడుతున్నాం  
డబుల్‌ బెడ్రూం ఇళ్ల పేరిట సొంతింటిని ఖాళీ చేయించారు. అప్పటి నుంచి కిరాయి ఇంటిలోనే ఉంటున్నాం. ఏళ్లు గడుస్తున్నా..ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదు. యేటా పెరుగుతున్న అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నాం. త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే బాగుంటుంది.  
– జీలకర్ర నవీన్, ఆజాద్‌నగర్‌   

అయిదో దసరా వచ్చింది  
మా ఇల్లు ఖాళీ చేయించి నిర్మాణాలు చేపట్టారు. దసరా పండగకు గృహ ప్రవేశం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి నాలుగు దసరా పండగలు గడిచిపోయాయి. అయిదోసారి దసరా దగ్గరకు వచ్చింది.  
– కొత్తపల్లి అనిల్‌ కుమార్, సాయినగర్‌

మరిన్ని వార్తలు