ఇక్రిశాట్‌: శనగ వయసు ఏకంగా 12,600 ఏళ్లు

11 Nov, 2021 17:33 IST|Sakshi

శనగల సంపూర్ణ జన్యుక్రమ నమోదు పూర్తి

ఇక్రిశాట్‌ నేతృత్వంలో 41 సంస్థల పరిశోధన..

కొత్త వంగడాల సృష్టికి మార్గం సుగమం 

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌తో పాటు దాదాపు 50 దేశాల్లో విరివిగా వాడే శనగల పూర్తిస్థాయి జన్యుక్రమ నమోదు పూర్తయింది. అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌) నేతృత్వంలో దేశ విదేశాలకు చెందిన 41 పరిశోధన సంస్థలు కలసి నిర్వహించిన ప్రాజెక్టు ఫలితంగా సంపూర్ణ జన్యుక్రమం సిద్ధమైంది. దీంతో అధిక దిగుబడులిచ్చే, చీడపీడలు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థంగా తట్టుకోగల కొత్త వంగడాల సృష్టికి మార్గం సుగమైంది. ఇక్రిశాట్‌ 2013లో ‘కాబూలీ చనా’అని పిలిచే ఒక రకం శనగల జన్యుక్రమాన్ని విజయవంతంగా నమోదు చేసింది.
చదవండి: Stress Relief:: నువ్వులు.. గుడ్లు.. శనగలు..షెల్‌ఫిష్!

అయితే మరిన్ని రకాల జన్యుక్రమాలను కూడా నమోదు చేయడం ద్వారా శనగల పుట్టు పూర్వోత్తరాల గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. దాదాపు 3,366 శనగ రకాలను ఎంపిక చేసి వాటన్నింటి జన్యుక్రమాలను నమోదు చేసి, విశ్లేషణ జరిపింది. ఫలితంగా శనగల్లో దాదాపు 29,870 జన్యువులు ఉంటాయని స్పష్టం కాగా ఇందులో 1,582 జన్యువులను మొదటిసారి గుర్తించారు. 
చదవండి: ఇక్రిశాట్‌ మరో అద్భుతం.. కరువు తట్టుకునేలా..

మధ్యధరా ప్రాంతంలో పుట్టుక.. 
‘సిసెర్‌ రెటిక్యులాటమ్‌’అనే అడవిజాతి మొక్క నుంచి దాదాపు 12,600 ఏళ్ల కింద శనగలు పుట్టుకొచ్చాయని ఇక్రిశాట్‌ సంపూర్ణ జన్యుక్రమ విశ్లేషణ ద్వారా తేలింది. ఫర్టైల్‌ క్రెసెంట్‌గా పిలిచే ప్రస్తుత ఇజ్రాయెల్, ఇరాక్, సిరియా ప్రాంతంలో పుట్టిన ఈ పంట కాలక్రమంలో టర్కీ మీదుగా మధ్యధరా ప్రాంతానికి, దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికా ప్రాంతాలకు రెండు మార్గాల్లో విస్తరించింది. 

ప్రయోజనాలేమిటి? 
శనగల సంపూర్ణ జన్యుక్రమం నమోదు కారణంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ప్రొటీన్‌ వనరుగా శనగల కోసం డిమాండ్‌ పెరగనుంది. వేర్వేరు రకాల జన్యుక్రమాలను ఈ సంపూర్ణ జన్యుక్రమంతో పోల్చి చూడటం ద్వారా పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతున్న జన్యువులను గుర్తించడం సులువు కానుంది. చెడు జన్యువులను తగ్గించి.. మంచి జన్యువుల పనితీరును మెరుగుపరిస్తే మంచి లక్షణాలున్న శనగల వంగడాలను అభివృద్ధి చేయొచ్చు. మంచి జన్యువులను చొప్పిస్తే కొత్త వంగడాల్లో వచ్చే తేడాను కంప్యూటర్‌ మోడలింగ్‌ ద్వారా పరిశీలించారు. దీని ప్రకారం శనగల దిగుబడికి కొలమానంగా చూసే వంద విత్తనాల బరువు 12 నుంచి 23 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. 

పుష్టికరంగా మార్చేందుకు
‘శనగ పంట దిగుబడిని పెంచేందుకు మాత్రమే కాదు. శనగలను మరింత పుష్టికరంగా మార్చేందుకు ఈ సంపూర్ణ జన్యుక్రమం చాలా ఉపయోగపడుతుంది.’ 
– ప్రొఫెసర్‌ రాజీవ్‌ వార్ష్‌నీ, రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్, ఇక్రిశాట్‌

పరిశోధనలు కొనసాగిస్తాం
‘దశాబ్ద కాలంలో శనగలకు సంబంధించిన పలు జన్యుపరమైన వనరులను ఇక్రిశాట్‌ అందుబాటులోకి తెచ్చింది. రైతులు, వినియోగదారులు, దేశాలకు ఎంతో ప్రయోజనకరమైన శనగ పరిశోధనలను కొనసాగిస్తాం’.  
–డాక్టర్‌ జాక్వెలీన్‌ హ్యూగ్స్, డైరెక్టర్‌ జనరల్, ఇక్రిశాట్‌  

మరిన్ని వార్తలు