గ్రామీణ బాలికలు.. డాక్టరమ్మలు 

20 Jan, 2024 04:14 IST|Sakshi

మెడికల్‌ కోర్సులపై రాష్ట్రంలోని గ్రామీణ బాలికల ఆసక్తి

ఆ తర్వాత టీచర్‌ ఉద్యోగాలకు మొగ్గు

పోలీస్, ఆర్మీ, ఇంజనీరింగ్‌ వైపు అబ్బాయిల చూపు

కేంద్ర ‘యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌’లో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామీ­ణ ప్రాంతాల బాలికలు ఎక్కువగా వైద్య రంగం వైపే చూస్తున్నారు. 14.2 శాతం మంది డాక్టర్‌ కావాలనుకుంటే, మరో 25.2 శాతం మంది నర్స్‌ అవుదామని ఉందని చెప్పారు. అదే మగపిల్లల్లో డాక్టర్‌ కా­వాలనుకుంటున్నవారు 4.7 శాతం మందేకావడం గమనార్హం. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా చూసి­నా.. బాలికలు డాక్టర్, నర్స్‌ లేదా టీచర్‌ కా­వాలని కోరుకుంటే, బాలురు పోలీసు, ఇంజనీరింగ్, ఆర్మీ వైపు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యు­కేషన్‌ రిపోర్ట్‌’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

26 రాష్ట్రాల్లో సర్వే చేసి..
దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల పరిధిలో ఉన్న 1,664 గ్రామాల్లో 34,745 మంది 14–18 ఏళ్ల మధ్య వయసున్న బాలురు, బాలికలపై ఈ సర్వే చేశారు. వారి ఉద్యోగ/ఉపాధి ఆశలు, విద్యా ప్రమాణాలు, డిజిటల్‌ స్కిల్స్, చదువు ను నిజజీవితంలో ఏమేరకు అమలు చేస్తున్నా రనేది పరిశీలించారు. స్కూళ్లు, కాలేజీల్లో చదు వుతు­న్నవా­రితోపాటు బయటివారినీ ప్రశ్నించా రు. మొత్తంగా త్వరగా జీవితంలో స్థిరపడాలనేది చాలా మంది ఆలోచనగా ఉందని, ఆ ప్రకారమే ఉద్యోగం/ఉపాధిపై దృష్టిపెడుతున్నారని కేంద్ర నివేదిక పేర్కొంది.

లాక్‌డౌన్‌ సమయంలో కష్టాలు ఎదుర్కొన్నందున ప్రభుత్వ ఉద్యోగంపై చాలా మంది మక్కువ చూపిస్తున్నట్టు తెలిపింది. మహిళలు చదువుకున్నా ఇంటి పని తప్పదన్న ఉద్దేశంతో.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించింది. హోటల్‌ మేనేజ్‌­మెంట్, టైలరింగ్, బ్యూటీ పార్లర్, వ్యవ­సా­యం వంటి వాటిపై దృష్టిసారిస్తామని బాలికలు పేర్కొన్నట్టు తెలిపింది.

లెక్కలు, ఇంగ్లిష్‌లో వెనుకబాటు
తెలంగాణ గ్రామీణ యువతలో 14–18 ఏళ్ల వయసు వారిలో కూడికలు, తీసివే­తలు వంటి లెక్కలు చేయగలిగినవారు 21.5 శాతమేనని కేంద్ర నివేదిక పేర్కొంది. ఇంగ్లిష్‌పై కనీస అవగాహన ఉన్నవారు 41 శాతమేనని తెలిపింది. ఇక రాష్ట్రంలో పనిచేయడానికి ఆసక్తి చూపనివారిలో బాలురు 18 శాతం, బాలికలు 11.7 శాతం ఉన్నారు. పనిపై ఆసక్తి చూపనివారి విషయంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఈ అంశంలో దేశ సగటు రెండు శాతమే.

ఉద్యోగ భద్రతకే గ్రామీణ యువత మొగ్గు
‘‘గ్రామీణ యువత జీవితంలో త్వరగా స్థిరపడాలని, ఉద్యోగ భద్రత కావాలనే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర నివేదిక చెప్తోంది. దానికి తగ్గట్టుగానే చాలా మంది పనిని ఎంచుకుంటున్నారు. అయితే సమాజ అవసరాలు కూడా ముఖ్యమే. పరిశోధనలు, ఉన్నత విద్య, వైద్య రంగంలో స్థిరపడటంలో ఆలస్యం కారణంగా తక్కువ మంది వాటివైపు వస్తున్నారు. పనిచేయడానికి ఆసక్తి చూపనివారూ ఎక్కువగా ఉండటం వెనుక కారణాలను అన్వేషించాలి.   – డాక్టర్‌ కిరణ్‌ మాదల, 
సైంటిఫిక్‌ కన్వీనర్, ఐఏఎం, తెలంగాణ 

>
మరిన్ని వార్తలు