కొత్త డ్యామ్‌కు సమ్మతి తెలపండి

26 Apr, 2022 02:52 IST|Sakshi

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కర్ణాటక సీఎం లేఖ 

పూడికతో తుంగభద్ర నిల్వ సామర్థ్యం తగ్గింది

అందువల్ల మా ఆయకట్టుకు నీళ్లివ్వలేక పోతున్నాం..

వరద కాల్వ, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మిస్తాం 

ఈ ప్రతిపాదనలపై చర్చిద్దాం రండి

సాక్షి, హైదరాబాద్‌: తుంగభద్ర జలాశయానికి అనుసంధానంగా వరద కాల్వతో పాటు 52 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ‘నావలి’బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించేందుకు ఆమోదం తెలపాలని సీఎం కేసీఆర్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై విజ్ఞప్తి చేశారు. పూడికతో తుంగభద్ర నిల్వ సామర్థ్యం 133 టీఎంసీల నుంచి 100.885 టీఎంసీలకు పడిపోయిన నేపథ్యంలో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేవలం వరదల సమయంలో జలాశయం నుంచి వరద ప్రవాహ కాల్వ ద్వారా బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు నీళ్లను మళ్లిస్తామని వివరించారు. బెంగళూరు లేదా మరోచోట ఈ ప్రతిపాదనలపై చర్చిద్దామని సూచించారు. ఈ మేరకు బొమ్మై ఇటీవల ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తుంగభద్ర కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో వరద కాల్వ, కొత్త బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు తెలుగు రాష్ట్రాల సమ్మతి అవసరమని ఆ లేఖలో పేర్కొన్నారు.

నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి లేదు.. 
కర్ణాటక, ఉమ్మడి ఏపీ రాష్ట్రాల్లోని అన్ని కాల్వలకు కృష్ణా ట్రిబ్యునల్‌–1 ఆవిరి నష్టాలను కలుపుకొని 230 టీఎంసీలను కేటాయించింది. ఆవిరి నష్టాలు పోగా 212 టీఎంసీల నీళ్లను వాడుకోవాల్సి ఉండగా, 1976–77 నుంచి 2017–18 మధ్య కాలంలో ఏటా సగటున 164.4 టీఎంసీలను మాత్రమే వాడుకోగలిగామని బొమ్మయ్‌ తెలిపారు. ఏటేటా పూడిక పేరుకుపోతుండటంతో పాటు అకస్మాత్తుగా స్వల్ప కాలం వరదలు పోటెత్తడం, కేవలం జూలై, ఆగస్టు నెలల్లోనే భారీ ప్రవాహం ఉండడంతో ఈ నీళ్లను నిల్వ చేసుకునే పరిస్థితి లేకుండా పోతోందని, తద్వారా తమ రాష్ట్రంలోని ఆయకట్టుకు నీటిని సరఫరా చేయలేకపోతున్నామని వివరించారు. తుంగభద్రలో పూడిక తొలగించడం లేదా అదనపు నిల్వల కోసం కొత్త రిజర్వాయర్‌ నిర్మించడం ఒక్కటే పరిష్కారమని స్పష్టం చేశారు. మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రతిపాదనలపై చర్చించడానికి ముందుకు రావాలని కేసీఆర్‌ను కోరారు.  

గతంలోనే తిరస్కరించిన నీటిపారుదల శాఖలు..
వాస్తవానికి ఈ ప్రతిపాదన కర్ణాటక ప్రభుత్వం రెండేళ్ల కిందటే చేసింది. అప్పుడే తెలంగాణ, ఏపీ నీటి పారుదల శాఖలు ఇందుకు నిరాకరించాయి. ఎగువన కొత్త బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణంతో దిగువన ఉన్న తమ రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలిపాయి. అయితే ఈసారి స్వయంగా రంగంలో దిగిన కర్ణాటక సీఎం.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించాలనే నిర్ణయం తీసుకున్నారు. తుంగభద్రలో పూడికను తొలగించడానికి రూ.12,500 కోట్ల వ్యయం అవుతుందని, నావలి వద్ద 492 అడుగుల గరిష్ట నిల్వ సామర్థ్యం (ఎఫ్‌ఆర్‌ఎల్‌)తో 52 టీఎంసీల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.9,500 కోట్లు, 486 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో నిర్మాణానికి రూ.6,000 కోట్ల వ్యయం అవుతుందని కర్ణాటక జలవనరుల శాఖ అంచనా వేసింది.

మరిన్ని వార్తలు