పెళ్లికి నో చెప్పిందని.. మరదలిపై కత్తితో దాడి

26 Apr, 2022 02:49 IST|Sakshi
మంచిర్యాల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి   

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై హత్యాయత్నం

యువతి మెడపై గాయాలు..

వెంటనే స్పందించి రక్షించిన బంధువులు

మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో ఘటన

నస్పూర్‌ (మంచిర్యాల): తనతో పెళ్లికి నిరాకరించిందని వరుసకు మరదలైన యువతి(21)పై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చి వెళ్తున్న ఆమెపై పట్టపగలు హత్యకు ప్రయత్నించాడు. సోమవారం మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. యువతి బంధువులు, స్థానిక ఎస్సై శ్రీనివాస్‌ ఈ ఘటన వివరాలను వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామానికి చెందిన యువతి సోమవారం నస్పూర్‌ గ్రామంలోని తమ బంధువుల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైంది.

కార్యక్రమం ముగిశాక తిరిగి ఇంటికి బయలుదేరింది. ఆమె ఆటో ఎక్కుతున్న సమయంలో వరుసకు బావ అయిన గడ్డం సాయికిరణ్‌ అక్కడికి వచ్చాడు. కల్లు గీసే కత్తి పట్టుకుని ఒక్కసారిగా ఆమెపై దాడికి ప్రయత్నించాడు. దీనితో ఆమె మెడపై గాయాలయ్యాయి. అది గమనించిన యువతి బంధువులు.. ఆమెను రక్షించి, మంచిర్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకుని, కత్తిని సీజ్‌ చేశామని ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు