5 లక్షల మందితో సభ.. ఎక్కడా తగ్గొద్దు

10 Jan, 2023 01:52 IST|Sakshi

ఖమ్మం సభ దేశం దృష్టిలో నిలవాలి

బీఆర్‌ఎస్‌ నేతలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

18న సభను సర్వశక్తులూ ఒడ్డి విజయవంతం చేయాలి 

20 నియోజకవర్గాల నుంచి కనీసం ఐదు లక్షల మందిని తరలించాలి 

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో ప్రగతిభవన్‌లో భేటీ 

మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడకు ఏర్పాట్ల బాధ్యతలు  

నేటి రాత్రికే ఖమ్మంకు మంత్రి హరీశ్‌రావు.. రేపు ఏర్పాట్లపై సమీక్ష 

100 ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు షురూ.. 

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షిప్రతినిధి, ఖమ్మం:  యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించేలా, భారీగా ఖమ్మం సభను నిర్వహించాలని పార్టీ నేతలను భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ నెల 18న జరగనున్న సభను సర్వశక్తులూ ఒడ్డి విజయవంతం చేయాలని, ఎక్కడా తగ్గొద్దని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు పొరుగునే ఉన్న సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్‌ జిల్లాల్లోని పది నియోజకవర్గాలు కలిపి.. మొత్తంగా 20 నియోజకవర్గాల నుంచి ఐదు లక్షల మందిని సభకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు.

సభ ఏర్పాట్ల బాధ్యతను మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌లకు అప్పగించారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో జరుగుతున్న ఖమ్మం బహిరంగ సభకు జన సమీకరణ, సభను సక్సెస్‌ చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. మూడు గంటలకుపైగా జరిగిన ఈ భేటీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. 

వ్యూహాత్మకంగా జన సమీకరణ 
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులే సభ సక్సెస్‌ చేసే కీలక బాధ్యతలు తీసుకోవాలని కేసీఆర్‌ స్పష్టం చేసినట్టు తెలిసింది. ఖమ్మంకు సమీపాన ఉన్న సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలు, మహబూబాబాద్, పాలకుర్తి, డోర్నకల్, ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, ఇల్లందు, సత్తుపల్లి నియోజకవర్గాల నుంచి 40 వేల మంది చొప్పున జన సమీకరణ చేసేలా ప్రణాళిక వేసుకోవాలని కేసీఆర్‌ ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మిగతా నియోజకవర్గాల నుంచి 10– 20 వేల మంది చొప్పున తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రూట్‌ మ్యాప్, పార్కింగ్, ఎన్ని వాహనాలు అవసరం. ఆ ప్రాంతంలో ఎన్ని వాహనాలు అందుబాటులో ఉన్నాయి, ట్రాఫిక్‌ జామ్‌ మళ్లింపు వంటి అంశాలపైనా చర్చించారు.   

రాజకీయ పరిస్థితులపైనా చర్చ 
సీఎంతో భేటీలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, తాతా మధుసూదన్, విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, లావుడ్యా రాములునాయక్, వనమా వెంకటేశ్వరరావు, బానోతు హరిప్రియ, జెడ్పీ చైర్‌పర్సన్‌ లింగాల కమల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సభ నిర్వహణతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిస్థితులపై కేసీఆర్‌ చర్చించినట్టు తెలిసింది. ఈ సభ సక్సెస్‌ తమను రానున్న ఎన్నికల్లో విజయతీరాలకు చేరుస్తుందన్న ధీమా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధుల్లో వ్యక్తమవుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

నేడు ఖమ్మంకు మంత్రి హరీశ్‌రావు 
సభ బాధ్యతను అప్పగించిన ముగ్గురు మంత్రుల్లో మంత్రి హరీశ్‌రావు మంగళవారం రాత్రే ఖమ్మం చేరుకోనున్నారు. వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా ఒకట్రెండు రోజుల్లో వెళ్లనున్నారు. వారు సభ ముగిసే వరకు ఖమ్మంలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. బుధవారం ఖమ్మం వీడీవోస్‌ కాలనీలోని మంత్రి పువ్వాడ అజయ్‌ క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ సభ సన్నాహక సమావేశం నిర్వహించి.. జిల్లా, స్థానిక నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 

100 ఎకరాల్లో సభ 
ఖమ్మం నూతన కలెక్టరేట్‌ ప్రారంభం అనంతరం పక్కనే ఉన్న 100 ఎకరాల ప్రాంగణంలో బీఆర్‌ఎస్‌ సభ నిర్వహణకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సోమవారమే ప్రాంగణాన్ని చదును చేసే పనులు మొదలు పెట్టారు. ఖమ్మం నియోజకవర్గ నేతలు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. సీపీ విష్ణు ఎస్‌.వారియర్, ఇతర పోలీసు అధికారులు ప్రాంగణాన్ని పరిశీలించి.. బందోబస్తు, పార్కింగ్‌ ఏర్పాట్లపై ప్రాథమికంగా చర్చించారు. 

బహుముఖ వ్యూహంతోనే ఖమ్మం ఎంపిక 
ఖమ్మం సభ ద్వారా దేశ రైతాంగం, ప్రజలు, రాజకీయ వర్గాలకు బీఆర్‌ఎస్‌ ఎజెండాపై పూర్తి స్పష్టత ఇవ్వాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. సభకు హాజరవనున్న ముఖ్యమంత్రుల చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉందని తెలిసింది. ఇక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో కేవలం ఒకే అసెంబ్లీ సీటును గెలుచుకున్న నేపథ్యంలో.. ఇక్కడ పార్టీ బలోపేతానికి ఈ సభ తోడ్పడుతుందని భావిస్తున్నారు.

ఇదే సమయంలో టీటీడీపీ, వైఎస్సార్‌టీపీ వంటి పార్టీలు ఖమ్మంపై దృష్టి కేంద్రీకరించడాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది. కమ్యూనిస్టు పారీ్టలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంత బలం ఉండటం, మునుగోడులో బీఆర్‌ఎస్‌ మద్దతు కూడా ఇచి్చన నేపథ్యంలో.. ఆ పారీ్టల జాతీయ నాయకత్వాన్ని కేసీఆర్‌ ఆహ్వానించారు. పొరుగునే ఉన్న ఏపీ నుంచి కూడా కొంత మంది సభకు రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఏపీ నుంచి జన సమీకరణపై ఆ రాష్ట్ర బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో నేడో రేపో కేసీఆర్‌ సమావేశం కానున్నట్టు తెలిసింది. 

జాతీయ స్థాయిలో చర్చ.. ఎన్నికల రిహార్సల్‌.. 
జాతీయ స్థాయి నేతలను ఆహా్వనిస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ సభను కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో అరంగే్రటం తర్వాతి తొలి సభ కావడంతో భారీగా నిర్వహించాలని భావిస్తున్నారని అంటున్నాయి. ఈ సభకు పంజాబ్, ఢిల్లీ, కేరళ సీఎంలను, యూపీ, కర్ణాటక మాజీ సీఎంలు అఖిలేశ్, కుమారస్వామిలను కూడా ఆహా్వనించారు. సీపీఎం, సీపీఐ ప్రముఖులను, ప్రాంతీయ పార్టీల నేతలనూ ఆహా్వనించినట్టు సమాచారం. వీరి హాజరు, భారీ సభతో దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ జరుగుతుందని.. ఇది ఎన్నికలకు రిహార్సల్‌ అని పార్టీ నేతలు అంటున్నారు.  

మరిన్ని వార్తలు