జోరు తగ్గని కృష్ణా

28 Jul, 2021 02:52 IST|Sakshi

శ్రీశైలంలోకి 3.98 లక్షల క్యూసెక్కుల ప్రవాహం 

876.89 అడుగుల నీటి మట్టం.. 172.66 టీఎంసీల నిల్వ 

నేడు గేట్లు తెరిచే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, మలప్రభ, ఘటప్రభ, తుంగభద్ర వంటి ఉప నదులు పోటెత్తి ప్రవహిస్తుండటంతో కృష్ణా నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.98 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 876.89 అడుగులకు చేరింది. 172.66 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పశ్చిమ కనుమల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు కురవడంతో ఎగువన ఆల్మట్టిలోకి కృష్ణా వరద ప్రవాహం 3.92 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. తుంగభద్రలోనూ వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు శ్రీశైలానికి ఇదే రీతిలో వరద కొనసాగే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 43 టీఎంసీలు అవసరం కాగా, భారీ వరదతో ప్రాజెక్టు నిండే అవకాశం ఉండటంతో బుధవారం గేట్లు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్‌ 35,315 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తోంది. శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్న ప్రవాహంతో సాగర్‌లో నీటి మట్టం 539.7 అడుగులకు పెరిగింది. నీటి నిల్వ 187.70 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతల ప్రాజెక్టు ఇప్పటికే నిండిపోయింది. పులిచింతల ప్రాజెక్టులో తెలంగాణ సర్కార్‌ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న నీటికి కట్టలేరు, వైరా, మున్నేరు వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 26,011 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. మరోవైపు పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది.

విద్యుదుత్పత్తికి ఏపీకి బోర్డు అనుమతి 
ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో శ్రీశైలం కుడి గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలన్న ఏపీ సర్కార్‌ ప్రతిపాదనను కృష్ణా బోర్డు ఆమోదించింది. దాంతో ఆ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించాలని ఏపీ జెన్‌కో అధికారులకు శ్రీశైలం ప్రాజెక్టు సీఈ మురళీనాథ్‌రెడ్డి సూచించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు