ప్రగతిలో తెలంగాణ ప్రతిభ

5 Jul, 2022 02:34 IST|Sakshi
హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రదానోత్సవంలో మాట్లాడుతున్న కేటీఆర్‌

ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్స్‌ అవార్డుల ప్రదానంలో మంత్రి కేటీఆర్‌

అగ్రశ్రేణి రాష్ట్రాల సరసన చేరిక

కేసీఆర్‌ ఆశయానికి అనుగుణంగా పారిశ్రామికంగా అగ్రస్థానం

ఎంఎస్‌ఎంఈలకు త్వరలో పెండింగ్‌ ప్రోత్సాహకాల విడుదల 

సాక్షి, హైదరాబాద్‌: పారిశ్రామికంగా శరవేగంగా ముందుకు సాగుతూ తక్కువ కాలంలోనే తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రాల సరసన నిలబడే స్థాయికి చేరిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాష్ట్ర పురోగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ అవలంబిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలే ఇందుకు కారణమని చెప్పారు. తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన పరిశ్రమలకు సోమవారం హెచ్‌ఐసీసీలో ఎక్సలెన్స్‌ అవార్డులను ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌తోపాటు ఇతర రంగాల్లోనూ దూసుకుపోతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఎస్‌ ఐపాస్‌ చట్టం ద్వారా 15 రోజుల్లో పరిశ్రమలకు డీమ్డ్‌ అప్రూవల్‌ విధానాన్ని అమలుచేస్తున్నట్లు చెప్పారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడిదారులకు ఆశించిన గౌరవం లభించడం లేదని, కానీ తెలంగాణలో పారిశ్రామికవేత్తలను సంపద సృష్టికర్తలుగా, ఉద్యోగాల సృష్టికర్తలుగా గుర్తిస్తున్నామని అన్నారు.

ఒక్కటీ లాకౌట్‌ పడలేదు..
అందరి అంచనాలను, సందేహాలను పటాపంచలు చేస్తూ ఎవరూ ఊహించని విధంగా దేశంలోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. గుజరాత్‌లో సైతం ఈ ఏడాది వేసవిలో పవర్‌ హాలిడే ప్రకటించారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి వల్లనే తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. గతంలో అగ్రశ్రేణి రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఉండగా, ప్రస్తుతం ఈ జాబితాలో తెలంగాణ కూడా చేరిందన్నారు.

పరిశ్రమల శాఖలో ప్రభుత్వ జోక్యాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించినట్లు చెప్పారు. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా ఒక్క పరిశ్రమ కూడా లాకౌట్‌ పడిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో వ్యాపారులు, పెట్టుబడిదారులు సంతృప్తిగా ఉన్నారనేందుకు రాష్ట్రంలో రిపీట్‌ పెట్టుబడులు 24 శాతం ఉండటమే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో సైతం పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. 
 
నాలుగేళ్లలోనే కాళేశ్వరం
రికార్డుస్థాయిలో కేవలం నాలుగేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసినట్లు కేటీఆర్‌ చెప్పారు. దీనిద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ నీటితో వివిధ ప్రాంతాల్లో మొత్తం 184 టీఎంసీల సామర్థ్యం గల జలాశయాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు కూడా త్వరలోనే పూర్తవుతాయన్నారు.

భవిష్యత్తులో వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, డెయిరీ పరిశ్రమ, మాంసం ఉత్పత్తులు, వంట నూనెల ఉత్పత్తి తదితర రంగాలు అభివద్ధి చెందనున్నట్లు చెప్పారు. కోవిడ్‌ కారణంగా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాల విడుదలలో కొంత జాప్యం జరిగిందని, ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడినందున త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌తోపాటు ఎఫ్‌టీసీసీఐకి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 

కాకతీయ వైభవ సప్తాహంపై సమీక్ష
కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాల్లో అన్ని పార్టీలు, అన్ని రంగాలకు చెందిన వారు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈనెల ఏడు నుంచి వారంపాటు జరిగే ఈ కార్యక్రమాలపై ఆయన సోమవారం సమీక్షించారు.   

మరిన్ని వార్తలు