పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు

4 Sep, 2020 12:35 IST|Sakshi

సాక్షి, కేయూ క్యాంపస్(వరంగల్‌)‌ : కాకతీయ యూనివర్సిటీలోని అన్ని విభాగాల పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు బోధించాలని రిజిస్ట్రార్‌ ఆచార్య పురుషోత్తం సూచించారు. కేయూలోని విభాగాధిపతులతో ఆయన ఆన్‌లైన్‌ ద్వారా గురువారం సమీక్షించారు. ఈనెల 1వ తేదీ నుంచే ఆన్‌లైన్‌ పాఠాల బోధన ప్రారంభం కావాల్సి ఉందన్నారు. ఇకనైనా త్వరగా విద్యాబోధన చేపట్టేందుకు విద్యార్థులతో వాట్సాప్‌ గ్రూపులు సిద్ధం చేయాలని తెలిపారు. ఆ వెంటనే జూమ్‌ యాప్‌ లేదా గూగుల్‌ మీట్‌ ద్వారా తరగతులు నిర్వహించాలని, అవసరం మేరకు ఎంపిక చేసిన పార్ట్‌ టైం లెక్చరర్ల జాబితా అందిస్తే ఉత్తర్వులు ఇవ్వనున్నామని వెల్లడించారు.

మేం సిద్ధమే కానీ...
పలువురు విభాగాధిపతులు మాట్లాడుతూ ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు తాము సుముఖంగానే ఉన్నా విభాగా ల్లో కొందరు అధ్యాపకులు సంతకాలు చేసి ఇళ్లకు వెళ్లిపోతున్నారని రిజిస్ట్రార్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆయన స్పందిస్తూ కోవిడ్‌ దృష్ట్యా ఇళ్లకు వెళ్లి ఉంటే అక్కడి నుంచే పాఠాలు బోధించేలా విభాగాధిపతులు పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే, విద్యార్థులతో కూడా తరచుగా మాట్లాడాలని తెలిపారు. 

డిగ్రీ సెమిస్టర్ల విద్యార్థులు ప్రమోట్‌
కేయూ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ రెండో సెమిస్టర్‌ విద్యార్థులను మూడో సెమిస్టర్‌కు, నాలుగో సెమిస్టర్‌ విద్యార్థులను ఐదో సెమిస్టర్‌కు ప్రమో ట్‌ చేశారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌ పురుషోత్తం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్‌ నేపథ్యంలో పరీక్షలు ఇప్పట్లో నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో యూజీసీ నిబంధనల మేరకు కేయూ డీన్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విద్యార్థులను ప్రమోట్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు