చిట్‌ఫండ్‌ మోసాలకు కళ్లెం 

6 Nov, 2023 05:02 IST|Sakshi

ఆన్‌లైన్‌లో చిట్‌ఫండ్‌ కంపెనీల పర్యవేక్షణ 

అందుబాటులోకి ఈ–చిట్స్‌ అప్లికేషన్‌ 

అన్ని కంపెనీల చిట్ల వివరాలు ఇందులో నమోదు చేయాల్సిందే 

కొత్త విధానంలో ఆన్‌లైన్‌లోనే చిట్లకు అనుమతులు ఇవ్వనున్న అధికారులు 

చందాదారులకు ప్రతి విషయం తెలిసేలా ఏర్పాట్లు 

చిట్లు కట్టే చందాదారుల భద్రతే ప్రధాన లక్ష్యం 

ఇప్పటికే ఉన్న కంపెనీలు సైతం ఈ విధానం పరిధిలోకి రావాల్సిందే 

సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి’ వంటి కంపెనీల మోసాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటికి కళ్లెం వేస్తోంది. చిట్‌ఫండ్‌ వ్యవహారాలను కట్టుదిట్టం చేసేందుకు.. ఈ సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. సదరు కంపెనీలు నిర్వహించే చిట్ల వివరాలన్నీ ప్రజలకు తెలిసేలా ఆన్‌లైన్‌ విధానాన్ని రూపొందించి ‘ఈ–చిట్స్‌’ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. వివిధ చిట్‌ఫండ్‌ కంపెనీల్లో చిట్లు కట్టే చందాదారుల భద్రతే ప్రధాన లక్ష్యంగా దీన్ని అమలుచేస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఆప్షన్‌ ఇచ్చింది.

ఇకపై చిట్‌ఫండ్‌ కంపెనీలు తమ చిట్స్‌ వివరాలన్నింటినీ ఈ అప్లికేషన్‌లో నమోదు చేయాల్సిందే. మొన్నటివరకు చిట్స్‌ రిజిస్ట్రార్ల అనుమతితో ఆ కంపెనీలు రికార్డులు నిర్వహించేవి. గ్రూపుల వారీగా అనుమతి తెచ్చుకుని వాటి రిజిస్టర్లను తమ ఇష్టానుసారం మార్చుకుంటున్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ రిజిస్టర్లకు నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోకపోవడం, తీసుకున్నా వాటిని సరిగ్గా నిర్వహించకపోవడం, ఆ వివరాలను చందాదారులకు తెలియకుండా దాచడం వంటి అనేక ఉల్లంఘనలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

దీనివల్ల ఆ కంపెనీల్లో ఏం జరుగుతుందో బయటకు తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పలు చిట్‌ఫండ్‌ కంపెనీలు బోర్డు తిప్పేయడం, లక్షలాది మంది చందాదారులు తమ శ్రమను ధారపోసి కట్టిన సొమ్మును నష్టపోవడం చాలా సందర్భాల్లో జరిగాయి. ఇలాంటి చిట్‌ఫండ్‌ కంపెనీల మోసాలకు సంబంధించి ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. 
 
మోసాలు అరికట్టడమే లక్ష్యం.. 
దీంతో.. రాష్ట్రంలో చిట్‌ఫండ్‌ మోసాలను అరికట్టే లక్ష్యంతో ఆన్‌లైన్‌ చిట్స్‌ పర్యవేక్షణ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ నిర్వహించే ఈ నూతన ఎలక్ట్రానిక్‌ విధానాన్ని రాష్ట్రంలోని చిట్‌ఫండ్‌ కంపెనీలన్నీ తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని స్పష్టంచేశారు. చిట్‌ఫండ్‌ కంపెనీలు తమ లావాదేవీలను ఈ అప్లికేషన్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాల్సి వుంటుంది. ఏదైనా చిట్‌ఫండ్‌ కంపెనీ తమ చిట్లకు అనుమతులను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. వాటిని చిట్‌ రిజిస్ట్రార్లు ఆన్‌లైన్‌లోనే పరిశీలించి ఆమోదిస్తారు.

ప్రతి చిట్‌కు సంబంధించిన గ్రూపు వివరాలు, మార్పులు, చేర్పులు, ప్రతినెలా జరిగే వేలం పాటలు వంటివన్నీ ఆన్‌లైన్‌లోనే పొందుపరుస్తారు. ఈ వివరాలన్నింటినీ చందాదారులు ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ప్రతినెలా తాను కట్టే చిట్‌ వివరాలను ఆన్‌లైన్‌లోనే చూసి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. చిట్‌ఫండ్‌ కంపెనీల మోసాలను అరికట్టడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

చిట్‌ఫండ్‌ కంపెనీలను సమర్థవంతంగా నియంత్రించడంలోనూ వ్యాపారంలో పారదర్శకత తీసుకురావడంలోనూ ఈ నూతన విధానం ఎంతగానో దోహదపడుతుందంటున్నారు. ఇప్పటికే ఉన్న చిట్‌ గ్రూపుల వివరాలను కూడా త్వరలో ఈ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో నమోదు చేయనున్నారు. చందాదారులు తమ అనుమానాలను దీనిద్వారానే నివృత్తి చేసుకోవచ్చు. ఏవైనా సమస్యలున్నా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు.   

మరిన్ని వార్తలు