‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై హైస్పీడ్‌లో భూసేకరణ.. నవంబర్‌లో రంగంలోకి కలెక్టర్లు!

19 Oct, 2022 07:39 IST|Sakshi

తొలుత అటవీ అనుమతుల కోసం దరఖాస్తు 

అది రాగానే రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు ‘పర్యావరణ క్లియరెన్స్‌’ 

వాతావరణ, శబ్ద, నీటి కాలుష్య నిరోధానికి చర్యలు 

నవంబర్‌లో 4 జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామ సభలు 

భూసేకరణ అవార్డ్‌ పాస్‌ చేసేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్న ఎన్‌హెచ్‌ఏఐ  

సాక్షి, హైదరాబాద్‌: రీజనల్‌ రింగు రోడ్డు ఉత్తర భాగం భూసేకరణ ప్రక్రియను అధికారులు వేగిరం చేశారు. ఇప్పటికే సర్వే పూర్తిచేసిన అధికారులు.. భూసేకరణ అవార్డ్‌ పాస్‌ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించారు. అవార్డ్‌ పాస్‌ చేయాలంటే కచ్చితంగా పర్యావరణ అనుమతి వచ్చి ఉండాలి, ఇది రావాలంటే అటవీ అనుమతుల్లో స్టేజ్‌–1 మంజూరు కావాలి. ఈ రెండింటిని త్వరగా పొందేందుకు చర్యలు చేపట్టారు. 

అటవీ అనుమతులు.. గ్రామసభలు 
రీజనల్‌ రింగు రోడ్డు ఉత్తర భాగంలో 70 హెక్టార్ల మేర అటవీ భూములు పోనున్నాయి. అంతమేర స్థలాన్ని అటవీశాఖకు అప్పగిస్తే చెట్లను పెంచుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ స్థలాలిచ్చే అవకాశం లేదు. బదులుగా ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో రెట్టింపు స్థలంలో మొక్కలను పెంచనున్నారు. మొక్కలు నాటి, ఐదేళ్ల వరకు సంరక్షించేందుకు అయ్యే ఖర్చును అటవీ శాఖకు జాతీయ రహదారుల సంస్థ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. 

దీనికి సంబంధించి స్పష్టమైన హామీతో అటవీశాఖ స్టేజ్‌–1 అనుమతిని ఇస్తుంది. డబ్బులు డిపాజిట్‌ చేశాక స్టేజ్‌–2 అనుమతులు వస్తాయి. ఇక పర్యావరణ అనుమతుల కోసం నవంబర్‌లో గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ అధికారులు 4 జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. కలెక్టర్లు గ్రామసభల తేదీలను ప్రకటించి, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో వివరిస్తారు. గ్రామసభల ఆమోదంతో పర్యావరణ అనుమతులు రానున్నాయి. 

ఆరు నెలలకోసారి వాహన శబ్దాలపై సమీక్ష 
రీజనల్‌ రింగ్‌ రోడ్డు యాక్సెస్‌ కంట్రోల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే అయినందున వాహనాలు వేగంగా ప్రయాణిస్తాయి. ఈ రోడ్డును ప్రధాన పట్టణాలకు చేరువగా నిర్మిస్తుండటంతో శబ్ద కాలుష్యం జనావాసాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ క్రమంలో అవసరమైన ప్రాంతాల్లో శబ్దాన్ని నిరోధించే నాయిస్‌ బారియర్లను ఏర్పాటు చేస్తారు. మిగతా ప్రాంతాల్లో జనావాసాల్లోకి వెళ్లే శబ్దాన్ని అడ్డుకునేలా రోడ్ల పక్కన పొడవుగా ఉండే చెట్లను పెంచుతారు. వెలువడే శబ్దం పరిస్థితి పరికరాల ద్వారా ప్రతి ఆరు నెలలకోసారి సమీక్షిస్తారు. శబ్ద కాలుష్యం నిర్ధారిత పరిమాణాన్ని మించి ఉంటే మరిన్ని చర్యలకు సిఫార్సు చేస్తారు. ఈ వివరాలను వచ్చే నెలలో జరిగే గ్రామసభల్లో వివరించనున్నారు.

మరిన్ని వార్తలు