నెలరోజుల్లో బ్రిటన్‌ ‌టూ తెలంగాణ 3వేల మంది..

24 Dec, 2020 08:19 IST|Sakshi

జాబితా తయారు చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ 

వారిలో 200 మంది నుంచి శాంపిళ్ల సేకరణ 

ఆరీ్టపీసీఆర్‌ పరీక్షలు చేయగా అందరికీ నెగెటివే 

 మిగిలిన వారిని వెతికేందుకు యంత్రాంగం సన్నాహాలు 

నిమ్స్‌లో జన్యు విశ్లేషణ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదన 

సాక్షి, హైదరాబాద్‌: బ్రిటన్‌లో కరోనా కొత్త రకం వైరస్‌ విజృంభణ నేపథ్యంలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గత నెల రోజుల్లో బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి దాదాపు 3 వేల మంది వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వారి వివరాలను రాష్ట్రానికి కేంద్రం అందించింది. వారిని రెండు భాగాలుగా విభజించారు. మొదటి రెండు వారాల్లో వచ్చిన  1,800 మంది ఒక గ్రూపు, డిసెంబర్‌ 9 నుంచి ఇప్పటివరకు వచ్చిన  1,200 మందిని రెండో గ్రూపుగా విభజించారు. మొదటి రెండు వారాల్లో వచ్చిన  1,800 మంది వివరాలు తెలుసుకొని వారిని ఆరోగ్య సిబ్బంది పరిశీలిస్తారు. వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలున్నాయా లేదా గుర్తిస్తారు. వారిని పరిశీలనలో మాత్రమే ఉంచుతారు. రెండో గ్రూపులో ఉన్న 1,200 మందిపై ఇప్పుడు వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. వారిలో 800 మంది జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారేనని అధికారులు వెల్లడించారు. వారిని వెతికే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. వారిలో ఇప్పటివరకు 200 మందిని గుర్తించారు. వారి నుంచి నమూనాలు తీసుకొని ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా, అందరికీ నెగెటివ్‌ వచ్చిదని అధికారులు తెలిపారు.

వారిని గుర్తించేందుకు కలెక్టర్లకు ఆదేశాలు 
గత రెండు వారాల్లో వచ్చిన  వారిలో మిగిలిన వెయ్యి మందిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. వారందరినీ రెండు, మూడు రోజుల్లో గుర్తించి యుద్ధప్రాతిపాదికన పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య డైరెక్టర్‌ శ్రీనివాసరావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. పాజిటివ్‌ వచ్చిన వారిని ఎక్కడికక్కడ ఐసోలేషన్‌ చేస్తారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 12 ఆసుపత్రులను గుర్తించారు. వారికి చికిత్స అవసరమైతే హైదరాబాద్‌ టిమ్స్‌కు తరలిస్తారు. అక్కడ మూడు అంతస్తులు ప్రత్యేకంగా బ్రిటన్‌ నుంచి వచ్చిన  వారి కోసం కేటాయించారు. పాజిటివ్‌ వచ్చిన  కుటుంబసభ్యులను కూడా ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచుతారు. 

ఈ నంబర్లకు ఫోన్‌ చేయండి 
బ్రిటన్‌ నుంచి వచ్చిన  వారి నుంచి ఆర్టీపీసీఆర్‌తో పాటు బ్రిటన్‌ వైరసా కాదా అని తెలుసుకునేందుకు జీనోమ్‌ విశ్లేషణ చేస్తారు. అయితే ఆరీ్టపీసీఆర్‌లో పాజిటివ్‌ వస్తేనే జీనోమ్‌ విశ్లేషణకు శాంపిల్‌ను పంపిస్తారు. జీనోమ్‌ విశ్లేషణ కోసం శాంపిళ్లను ముందుగా పుణేలోని వైరాలజీ లేబరేటరీకి పంపాలని భావించారు. కానీ హైదరాబాద్‌ సీసీఎంబీకే పంపాలని తర్వాత నిర్ణయించారు. బ్రిటన్‌ నుంచి వచ్చిన  వారు స్వచ్ఛందంగా కాల్‌చేస్తే ఇంటికొచ్చి నమూనాలు తీసుకొని పరీక్షలు చేస్తారు. అందుకోసం 040–24651119 నంబర్‌కు ఫోన్‌ చేయాలని లేదా 9154170960 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా సమాచారం అందించాలని ప్రజారోగ్య డైరెక్టర్‌ శ్రీనివాసరావు సూచించారు. కరోనా వైరస్‌లో అనేక మార్పులు వస్తుండటం, మున్ముందు కూడా వచ్చే అవకాశాలు ఉన్నందున జన్యు విశ్లేషణ తప్పనిసరని వైద్య, ఆరోగ్య శాఖ భావిస్తోంది. అందుకే నిమ్స్‌లో జన్యు విశ్లేషణ కేంద్రం ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది.   

మరిన్ని వార్తలు