Free Bus Journey For Women In TS: రేపట్నుంచే మహిళలకు ఉచిత ప్రయాణం.. మార్గదర్శకాలు ఇవే..

8 Dec, 2023 18:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా రేపటి(శనివారం) నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ సీఎండీ సజ్జనార్‌ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు అసెంబ్లీ వద్ద సీఎం రేవంత్‌ రెడ్డి ‘మహాలక్ష్మీ స్కీమ్‌’ను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఫ్రీగా జీరో అమౌంట్ టికెట్‌తో ప్రయాణించవచ్చని తెలిపారు. ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నాలుగైదు రోజులు గుర్తింపు కార్డు లేకుండా ప్రయాణించవచ్చుని తెలిపారు. ప్రయాణీకుల సంక్షేమం కోసం ఆర్టీసీ యాజమాన్యం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ ప్రయాణం మంచి స్కీమ్ అని కొనియాడారు. స్కీమ్‌తో ఆర్టీసీకి ఆదరణ మరింత పెరుగుతోందని చెప్పారు.

ప్రస్తుతం రోజుకు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తారని వెల్లడించారు. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రస్తుతం 7290 బస్సులు ఉన్నాయని, రోజు ఆదాయం 14 కోట్ల వరకు వస్తోందని తెలిపారు. మహిళలకు ఫ్రీ ప్రయాణంతో 50 శాతం ఆదాయం తగ్గుతుందని పేర్కొన్నారు. తగ్గే ఆదాయంపై ప్రభుత్వ సహాయంకై విజ్ఞప్తి చేశామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు