ఇప్పుడు రాలేను.. ఈడీకి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి లేఖ.. విచారణపై ఉత్కంఠ

19 Dec, 2022 11:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సోమవారం ఉదయం భేటీ అయ్యారు. ఈడీ విచారణకు హాజరుకావడంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ నెల 25 వరకు గడువు కావాలని ఈడీకి రోహిత్‌రెడ్డి లేఖ రాశారు. విచారణ షెడ్యూల్‌ మార్చాలని కోరారు. ఈడీ ఎంత సమయం ఇస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

విచారణకు హాజరు కాలేనని లాయర్‌తో ఈడీకి లేఖ పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు చాలా తక్కువ సమయం ఇచ్చారని రోహిత్‌ రెడ్డి అంటున్నారు. వరుస సెలవులు కారణంగా బ్యాంక్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్స్‌, ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేకపోయానని రోహిత్‌ రెడ్డి చెబుతున్నారు.

కాగా, ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్‌ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్‌ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది.

2015 నుంచి రోహిత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులకు సంబంధించిన ఆర్థిక, వ్యాపార లావాదేవీలు, ఐటీ, జీఎస్టీ రిటర్న్స్, బ్యాంకు స్టేట్‌మెంట్స్, స్థిరచరాస్తులతోపాటు రుణాల వివరాలు తీసుకురావాలంటూ ఈడీ స్పష్టం చేసింది. ఆధార్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు కాపీలు తీసుకురావాలని పేర్కొంది. అతడి కుటుంబీకులకు సంబంధించిన పూర్తి బయోడేటాను అందించాలని కోరిన ఈడీ.. దాని నమూనాను నోటీసులతో జత చేసింది. 
చదవండి: బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. కాంగ్రెస్‌ అసమ్మతి నేతలపై ఫోకస్‌

మరిన్ని వార్తలు