లోక్‌సభ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌!

24 Dec, 2023 05:12 IST|Sakshi

ఓవైపు ఎన్నికల సన్నద్ధత.. మరోవైపు అభ్యర్థుల ఎంపిక 

సిట్టింగ్‌లలో కొందరికే మళ్లీ టికెట్లు.. కొత్త వారికి చాన్స్‌ 

ఒక్కసారి కూడా గెలవని స్థానాలపై ప్రత్యేక దృష్టి 

ఎమ్మెల్సీ కవిత, వినోద్, నగేశ్‌లకు కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌? 

ఎక్కువ సీట్లు గెలుచుకుని కాంగ్రెస్, బీజేపీలపై పైచేయి సాధించాలనే యోచన 

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాలను అన్ని కోణాల్లో పోస్ట్‌మార్టం చేస్తున్న భారత రాష్ట్ర సమితి త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రణాళికపై దృష్టి సారించింది. శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో కోలుకుంటున్న పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా రెండు జాతీయ పార్టీలపై పైచేయి సాధించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు ఎన్ని కల సన్నద్ధతను వేగవంతం చేస్తూనే, మరోవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపైనా దృష్టి సారించారు. 

సిట్టింగ్‌లలో కొందరికే టికెట్లు 
ప్రస్తుతం లోక్‌సభలో బీఆర్‌ఎస్‌కు తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. అందులో దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్త ప్రభాకర్‌రెడ్డి తన మెదక్‌ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మిగతా ఎనిమిది మందిలో తిరిగి ఎందరికి టికెట్‌ దక్కుతుందనే అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. సిట్టింగ్‌ ఎంపీల్లో రంజిత్‌రెడ్డి (చేవెళ్ల), నామా నాగేశ్వర్‌రావు (ఖమ్మం) మినహా మిగతా ఆరుగురు.. పి.రాములు (నాగర్‌కర్నూల్‌), ఎం.శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌), దయాకర్‌ (వరంగల్‌), కవిత మాలోత్‌ (మహబూబాబాద్‌), బీబీ పాటిల్‌ (జహీరాబాద్‌), వెంకటేశ్‌ నేత (పెద్దపల్లి)లలో ఎవరికి టికెట్‌ కచ్చితంగా దక్కుతుందని కచ్చితంగా చెప్పలేమని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. వారిని మార్చే క్రమంలో కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే కోణంలో కసరత్తు జరుగుతోందని అంటున్నాయి. 

గత ఎన్నికల్లో ఓడిన సీట్లపై పరిశీలన 
గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన కల్వకుంట్ల కవిత (నిజామాబాద్‌), బోయినపల్లి వినోద్‌కుమార్‌ (కరీంనగర్‌), గోడెం నగేశ్‌ (ఆదిలాబాద్‌)లకు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కవిత, వినోద్‌కుమార్‌ ఇప్పటికే ఎన్నికల కోసం సన్నద్ధతను ప్రారంభించారు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలైన బూర నర్సయ్యగౌడ్‌ (భువనగిరి) బీజేపీలో చేరడంతో.. అక్కడ జిట్టా బాలకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ల పేర్లు తెరమీదకు వస్తున్నాయి.

మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి గతంలో పోటీచేసి ఓటమి పాలైన మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇటీవల మల్కాజిగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థిగా బీఆర్‌ఎస్‌ ఎవరికి చాన్స్‌ ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది. సికింద్రాబాద్‌ సీటు నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమారుడు సాయి కిరణ్‌కు మళ్లీ అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. నల్గొండ నుంచి శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆయన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. 

ఒక్కసారీ గెలవని స్థానాలపై నజర్‌ 
బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు నల్గొండ, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో ఒక్కసారి కూడా గెలవలేదు. హైదరాబాద్‌లో మిత్రపక్షమైన ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీచేస్తూనే మిగతా చోట్ల గెలుపు అవకాశాలను బీఆర్‌ఎస్‌ బేరీజు వేసుకుంటోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలోనూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలిచారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోనూ నాంపల్లి మినహా మిగతా ఆరు చోట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు చోట్ల బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని బీఆర్‌ఎస్‌ అధినేత భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

జాతీయ పార్టీల నేతలు పోటీ చేస్తే? 
రాష్ట్రం నుంచి ప్రధాని మోదీని పోటీ చేయాల్సిందిగా బీజేపీ.. సోనియాను పోటీ చేయాల్సిందిగా కాంగ్రెస్‌ కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీల అగ్రనేతలు రాష్ట్రం నుంచి బరిలోకి దిగితే ఎదురయ్యే పరిణామాలు, ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహంపై బీఆర్‌ఎస్‌ పరిశీలన జరుపుతోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు పార్టీ ఎంపీలతో విడివిడిగా భేటీ అవుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఎవరెవరు ఎంతమేర సన్నద్ధంగా ఉన్నారనే వివరాలు సేకరిస్తున్నారని అంటున్నాయి.   

>
మరిన్ని వార్తలు