పైనాపిల్, చాక్లేట్, వెనీలా.. నోరూరించే కెవ్వు కేక్స్‌..

26 Dec, 2021 13:31 IST|Sakshi

ప్రజల అభిరుచికి తగ్గట్లుగా వెరైటీ కేకులు

నూతన సంవత్సరం కోసం సిద్ధం చేస్తున్న వ్యాపారులు 

సాక్షి,మంచిర్యాలటౌన్‌: మారుతున్న కాలానికి అనుగుణంగా కేకులు సులభమైన పద్ధతులలో ఎన్నో రకాలుగా మరింత ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. పేస్ట్రీలు, మెరింగ్యూస్, కస్టర్డ్స్, ఫ్రూట్స్, నట్స్, డెజర్ట్‌ సాస్, బటరక్రీమ్, క్యాండీడ్‌ ఫ్రూట్స్‌తో ఎన్నో రకాల కేక్‌లను త యారు చేసి, ప్రజలకు అందిస్తున్నారు. రుచితో పాటు, ఇట్టే ఆకర్షించేలా పలు ఆకృతులతో పాటు, మనకు నచ్చిన రూపంలోనూ కేక్‌లను తయారు చేసి ఇస్తున్నారు.

ఇక ప్రతి ఏటా డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి నుంచి జనవరి 1వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా లక్షలాది కేక్‌లను కట్‌ చేస్తుంటారు. పోటీతత్వంతో హైదరాబాద్‌ వంటి నగరాల్లో లభించే కేక్‌లను మంచిర్యాలలో ప్రజలకు అందిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం ఒక్కరోజే వేలాది కేక్‌లు అమ్మకా లు సాగితే, సాధారణ రోజుల్లో వందలాది కేక్‌లు అమ్ముడుపోతున్నాయి. ప్రజల్ని ఆకర్షించేందుకు కేక్‌లను ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీలతో సిద్ధం చేస్తున్నారు.

రుచిని బట్టి ధరలు
పైనాపిల్, బటర్‌స్కాచ్, చాక్లేట్, వెనీలా, బ్లాక్‌ ఫారెస్ట్, రెడ్‌విల్వెట్, ఫ్రెష్‌ఫ్రూట్, చాక్లెట్‌ చాపర్‌ చిప్స్, వైట్‌ ఫారెస్టు, గమ్‌పేస్ట్, ఫౌంటేయిన్‌ వంటి రకాల కేకులు రూ.500లకు కేజీ నుంచి రూ. 1200ల వరకు లభిస్తున్నాయి. కొత్త వెరైటీతో వస్తున్న గమ్‌పేస్ట్, ఫౌంటేయిన్‌ కేక్‌లు కేజీకి రూ.1000 నుంచి రూ.1200ల వరకు లభిస్తున్నాయి. ఇక వీటితో పాటు రెగ్యులర్‌ కేక్‌లు కేజీకి రూ.200ల నుంచి రూ.400ల వరకు లభిస్తుండగా, కూల్‌ కేక్‌లు రూ.500ల నుంచి రూ.1000ల వరకు లభిస్తున్నాయి.

చాలా వెరైటీలు చేస్తున్నాం
ప్రజలు కొత్తకొత్త వెరైటీ కేక్‌లను ఇష్టపడుతున్నారు. అందుకే ధర ఎక్కువైనా రుచికరమైన కొత్త వాటిని తయారు చేస్తున్నాం. గమ్‌పేస్ట్, ఫౌంటేయిన్, చాక్లెట్‌ చాపర్స్‌ వంటి లేటెస్ట్‌ రకాలను తయారు చేస్తున్నాం. వీటి ధర రూ. వెయ్యికి పైగా ఉన్నా, వీటినే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. బార్బీ బొమ్మ, బాంబుల రూపంలో ఉన్న కేక్‌లను     చేస్తున్నాం.               
– కొండపర్తి రమేశ్, బేకరీ నిర్వాహకుడు, మంచిర్యాల

వెరైటీ కేక్‌లంటే ఇష్టం
ఏదైనా శుభసందర్భంలో కేక్‌లను తింటుంటాం. ఎప్పుడో ఒకసారి ఈ కేక్‌లను తింటాం కాబట్టి, వెరైటీ కేక్‌లను తినడం ఇష్టం. అందుకే అప్పుడప్పుడు కొనే కేక్‌లలో వెరైటీగా, కొత్త రుచులతో వచ్చే కేక్‌లను కొంటున్నాం.
– మహేందర్, రామకృష్ణాపూర్‌ 

చదవండి: రూ.5కేనాలుగు ఇడ్లీలు.. అక్కడ ఫుల్‌ డిమాండ్‌.. దీనికో ప్రత్యేకత ఉంది

మరిన్ని వార్తలు