ఆ భూములకు రైతు ‘బంద్‌’!

2 Jun, 2022 04:11 IST|Sakshi

వాణిజ్య లావాదేవీలు నడుస్తున్న లక్షలాది ఎకరాలకు నిలుపుదల

ఆలోచిస్తున్న సర్కారు.. ప్రతిపాదనలు సిద్ధం 

విల్లాలున్న, వెంచర్లున్న భూములకూ అందుతున్న రైతుబంధు

వాణిజ్య కార్యకలాపాలు నడిపిస్తూనే లబ్ధి పొందుతున్న వైనం

10 లక్షల ఎకరాలు తేలినా సర్కారుకు ఏటా వెయ్యి కోట్లు ఆదా 

రవీంద్రనాథ్‌ (పేరు మార్చాం)కు హైదరాబాద్‌ శివారులో ఐదెకరాల భూమి ఉంది. దానికి వ్యవసాయ పట్టా ఉంది. ఆ భూమిలో విల్లాలు నిర్మించారు. కానీ వ్యవసాయ భూమిగా రికార్డుల్లో ఉండటంతో ఏటా ఎకరాకు రూ. 10 వేల చొప్పున రైతుబంధు అందుతోంది. రికార్డుల ప్రకారం భూమిలో ద్రాక్ష తోట అని ఉంది.

రాజశేఖర్‌ (పేరు మార్పు) పేరుతో రంగారెడ్డి జిల్లాలో పదెకరాల భూమి ఉంది. అంతా వ్యవసాయ పట్టా భూమి. కానీ ఆ భూమిలో పంటలు పండట్లేదు. వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. కానీ వ్యవసాయ పట్టా ఉండటంతో ఏడాదికి రూ. లక్ష రైతుబంధు అందుకుంటున్నాడు. రికార్డుల ప్రకారం అందులో కూరగాయల సాగు చేస్తున్నట్లు ఉంది. 

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ పట్టా ఉండి అందులో పంటలు పండించకుండా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ రైతుబంధు సొమ్ము అందుకుంటుండటంపై సర్కారు గుర్రుగా ఉంది. వాణిజ్య లావాదేవీలు, ఇతరత్రా అవసరాలకు వాడే భూములకు వ్యవసాయ పట్టా ఉంటే రైతుబంధును నిలిపేయాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇలాంటి భూములు రాష్ట్రంలో ఎన్ని ఎకరాలున్నాయో ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. 

రైతుబంధు స్ఫూర్తికి విరుద్ధం
2018–19 వ్యవసాయ సీజన్‌ నుంచి రైతుబంధు ప్రారంభమైన విషయం తెలిసిందే. రైతుకు సాగు సమయంలో పెట్టుబడి ఖర్చుల నిమిత్తం అండగా ఉండాలని ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. మొదట్లో ఓ సీజన్‌కు ఎకరాకు రూ. 4 వేల చొప్పున వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి రూ. 8 వేలు ఇచ్చింది. ఇప్పుడు సీజన్‌కు ఎకరాకు రూ. 5 వేలు ఇస్తోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 50 వేల కోట్లకు పైగా రైతులకు సాయం చేసింది. ఈ ఏడాది యాసంగిలో 1.48 కోట్ల ఎకరాలకు సంబంధించి 63 లక్షల మంది రైతులకు రూ. 7,412 కోట్లు అందజేసింది. 2021–22 వ్యవసాయ సీజన్‌లో మొత్తం రూ. 14,772 కోట్లు అందజేసింది. 

నాలా మార్పిడి చేయకుండా వ్యవసాయ భూమిగానే..
రైతుబంధును కొందరు ధనవంతులైన సినిమా నటులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారులు, ఇతర ధనవంతులు కూడా తీసుకుంటు న్నారని ఆరోపణలు వినిపించాయి. అయితే వీటిని ప్రభు త్వం పెద్దగా పట్టించుకోలేదు. కానీ వాణిజ్య కార్యకలా పాల్లో, వ్యవసాయేతర రంగాల్లో ఉన్న భూములకు రైతు బంధు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని చర్చ జరగ డంతో దానిపై దృష్టి పెట్టింది. కొన్ని భూముల్లో పరిశ్రమలు, విల్లాలు, ఇళ్లు ఉన్నా వాటిని నాలా మార్పిడి చేయకపోవ డంతో వ్యవసాయ పట్టా భూములుగా చలామణి అవుతున్నాయి.

రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, వికారాబాద్‌ సహా అనేక జిల్లాల్లో ఇలాంటివి లక్షలాది ఎకరాలు ఉండొచ్చని అంటున్నారు. ఈ భూములు 10 లక్షల ఎకరాలు వెలుగుచూసినా ప్రభుత్వానికి ఏటా రూ. వెయ్యి కోట్లు ఆదా కానుంది. అయితే రైతుబంధు నిలుపుదలపై మాట్లాడటానికి వ్యవసాయాధికా రులు ఎవరూ సిద్ధంగా లేరు. రైతుబంధు విధాన నిర్ణయం తమ పరిధిలోది కాదని, ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఈ వానాకాలం సీజన్‌ రైతుబంధును త్వరలో విడుదల చేయాల్సి ఉండటంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని వేచి చూస్తున్నారు. 

మరిన్ని వార్తలు