Omicron Variant: ఒమిక్రాన్‌ను లైట్‌ తీసుకోవద్దు..! 2020 అక్టోబర్‌ తర్వాత ఏం జరిగిందో మరవొద్దు..

8 Dec, 2021 10:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ ‘ఒమిక్రాన్‌’వేరియెంట్‌ను ప్రజలు తేలిగ్గా తీసుకుంటే మరో ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ సాగుతుండటంతో పాటు క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండుగలు వస్తున్నందున మరింత జాగ్రత్తలు అవసరమని హెచ్చరిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటిదాకా ‘వేరియెంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌’గా ప్రకటించిన వాటిలో ఒమిక్రాన్‌ ఐదోది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ మానవ రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోవడంతోపాటు ఎక్కువ మందికి సోకడం, నెమ్మదిగా తీవ్రస్థాయికి చేరుకోవడం ద్వారా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు.  

ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశాలివే... 
డెల్టా కంటే వేగంగా విస్తరణతో పాటు సహజసిద్ధ లేదా టీకాలతో వచ్చిన రోగనిరోధకశక్తిని తప్పించుకోగలగడం, ఇప్పటికే కరోనా బారిన పడ్డవారికి రీఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం, బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్లు, మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌తో పాటు వేరే చికిత్సలకు లొంగే అవకాశాల తగ్గుదల, ఒక్క డోసూ తీసుకోని వారిలో కరోనా ముదిరే ప్రమాదం  ఆందోళన కలిగిస్తున్నాయి. 

గతేడాదిలాగే ముప్పు.. 
‘ఒమిక్రాన్‌ ఎక్కువ మందికి సోకు తుందే తప్ప అంత ప్రమాదకారి కాదని అజాగ్రత్తగా ఉండటం ఎంతమాత్రం మంచిది కాదు. ఇప్పటినుంచైనా జాగ్రత్తలు తీసుకోకపోతే చేజేతులా మరో ఉపద్రవం కొనితెచ్చుకున్నట్టే. 2020 అక్టోబర్‌ తర్వాత కేసులు పెరిగి ఫిబ్రవరికి సెకండ్‌వేవ్‌ ఉధృతి తీవ్రమైన విషయం మరవొద్దు. ఒక్కసారిగా కేసులు పెరిగితే ఆస్పత్రులు నిండి వైద్యవ్యవస్థ  ఒత్తిడికి లోనైతే ఇబ్బందిగా మారొచ్చు.

యాంటీ స్పైక్‌ యాంటీబాడీస్‌ బ్లడ్‌ టెస్ట్‌తో మనలో ఉన్న యాంటీబాడీస్‌పై స్పష్టత వస్తుంది. రెండు డోసుల టీకా తీసుకుని 6 నెలల తర్వాత ఏమేరకు యాంటీబాడీస్‌ ఉన్నాయో దీనితో తెలుసుకోవచ్చ. దీన్నిబట్టి బూస్టర్‌ డోసు అవసరమో కాదో నిర్ణయించుకోవచ్చు. యాంటీబాడీస్‌ తగ్గని వారికి ‘మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌’చికిత్స అందించినా నిష్ప్రయోజనం. అందువల్ల మోనోక్లోనల్‌ తీసుకోడానికి ముందే ఈ టెస్ట్‌ చేసుకుంటే మంచిది.’ 
–  డా. విశ్వనాథ్‌ గెల్లా, ఏఐజీ ఆసుపత్రి డైరెక్టర్‌ పల్మొనాలజీ, స్లీప్‌ డిజార్డర్స్‌ 

మరిన్ని వార్తలు