మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో రాష్ట్రపతి పర్యటన.. ప్రయాణించేందుకు అత్యాధునిక వాహనం

26 Dec, 2022 11:36 IST|Sakshi
ద్రౌపది ముర్ము ప్రయాణించే మెర్సిడెస్‌ ఎస్‌ క్లాస్‌ పుల్‌మన్‌గార్డ్‌ కారు

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఈ నెల 28న దేశ ప్రథమపౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాచలం ఏజెన్సీతో పాటు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. దీంతో రాష్ట్రపతి భద్రత విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.  ఈ క్రమంలోనే శత్రుదుర్భేద్యమైన వాహనాలను రాష్ట్రపతికి సమకూర్చనున్నారు. 

రోడ్డు మార్గంలో ఆలయానికి..
రాష్ట్రప్రతి, ప్రధాని వంటి అత్యున్నత పదవులు నిర్వహిస్తున్న వ్యక్తులకు భద్రత కల్పించే విషయంలో స్పస్టమైన విధి విధానాలు ఉన్నాయి. రాష్ట్రపతి దేశీయంగా రోడ్డు మార్గంలో ప్రయాణం చేసేప్పుడు అత్యాధునిక సౌకర్యాలు, కట్టుదిట్టమైన రక్షణ, భద్రత వ్యవస్థ ఉన్న కార్లను వినియోగిస్తారు. ఇందుకోసం రాష్ట్రపతి అధికారిక నివాసాలు ఉన్న ఢిల్లీ, హైదరాబాద్, సిమ్లాలలో ఈ వాహనాలు రాష్ట్రపతి ప్రయాణించేందుకు సదా సిద్ధంగా ఉంటాయి.

ఈ నెల 28న రాష్ట్రపతి వాయుమార్గం ద్వారా ఐటీసీకి చేరుకుని, అక్కడి నుంచి గోదావరి వంతెన మీదుగా సుమారు నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి రామాలయ ప్రాంగణం చేరుకుంటారు. రోడ్డు మార్గంలో రాష్ట్రపతి ఏ కారు ఉపయోగిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. 

మెర్సిడెస్‌ ఎస్‌ క్లాస్‌ (ఎస్‌ 600) పులిమన్‌ గార్డ్‌..
పబ్లిక్‌ డోమైన్‌లో ఉన్న వివరాల ఆధారంగా రాష్ట్రపతి వాహనశ్రేణికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  రాష్ట్రపతిగా ముర్ము పదవీ బాధ్యతలు స్వీకరించగానే అధికారిక వాహనంగా మెర్సిడెస్‌ బెంజ్‌, మేబ్యాక్, ఎస్‌ క్లాస్‌ (ఎస్‌ 600) పులిమన్‌ గార్డ్‌ను కేటాయించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెరీ వెరీ ఇంపార్టెంట్‌ పర్సన్స్‌ కోసమే మెర్సిడెస్‌ సంస్థ ఈ శ్రేణికి చెందిన కార్లను తయారు చేస్తుంది. రాష్ట్రపతి కోసం కేటాయించిన కారును అధికారిక కార్యక్రమాలకు తగ్గట్టుగా కస్టమైజ్‌ చేస్తారు.
చదవండి: Hyderabad: మహిళలపై పెరుగుతున్న నేరాలు.. ఈ ఏడాదిలోనే ఎన్ని కేసులంటే!

ఈ కారు బుల్లెట్‌ ప్రూఫ్, (ల్యాండ్, క్లెమోర్‌ మైన్‌) బ్లాస్ట్‌ ప్రూఫ్, విష రసాయనాల దాడి నుంచి కాపాడే అధునాత భద్రతా వ్యవస్థ ఉంటుంది. రాత్రి వేళలల్లోనూ ఈ వాహనాలను నడపవచ్చు.  ఫ్లాట్‌ టైర్‌ సిస్టమ్‌ ఉపయోగించడం వల్ల టైర్ల మీద దాడి జరిగినా కారు నడుస్తూనే ఉంటుంది. బరువు ఐదు టన్నులకు పైగా ఉంటుంది. గంటలకు 160 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. అధిక బరువు ఉన్నప్పటికీ కేవలం 8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. భద్రతా కారణాల రీత్యా ఈ వాహనానికి నంబర్‌ ప్లేట్‌ ఉండదు. 

హైదరాబాద్‌లో.. 
నిబంధనల ప్రకారం రాష్ట్రపతి వేసవి కాలంలో సిమ్లాలో, శీతాకాలంలో హైదరాబాద్‌లో విడిది చేయాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఇక్కడకు వచ్చినప్పుడు స్థానికంగా పర్యటనలకు వెళ్లేందుకు వీలుగా ఇక్కడ సైతం ప్రత్యేక వాహనాన్ని రాష్ట్రపతికి కేటాయించారు. మాజీ రాష్ట్రపతి హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా టయోటా మినర్వా ఫార్చునర్‌ ఎస్‌యూవీ కారును ఉపయోగించారు. ప్రస్తుత రాష్ట్రపతి పర్యటనలకు ఇదే కారును కేటాయించే అవకాశం ఉంది. ఈ కారు సైతం బుల్లెట్‌ ప్రూఫ్, బ్లాస్ట్‌ ప్రూఫ్, కెమికల్‌ గ్యాస్‌ ఎటాక్‌ ప్రూఫ్‌ ఫీచర్లను కలిగి ఉంటుంది.

భద్రతా ప్రమాణాల ప్రకారం మినర్వా ఫార్చునర్‌ బీ 6 లెవల్‌ రక్షణ అందిస్తుంది. ఈ కారు రెగ్యులర్‌ మెడల్‌ ఖరీదు రూ. 44 లక్షల దగ్గర ఉండగా రాష్ట్రపతికి ఉపయోగించే కస్టమైజ్డ్‌ వెహికల్‌ ధర రూ. 80 లక్షల వరకు ఉండవచ్చు. సాధారణ కారు 2,180 కేజీల బరువు ఉంటే మినర్వా 3,700 కేజీల బరువు వరకు ఉంటుంది. సాధారణ కారు గరిష్ట వేగం గంటకు 176 కిలోమీటర్లు ఉండగా రాష్ట్రపతి ఉపయోగించే కారు గంటకు 150 కి.మీ స్పీడ్‌తో నడవగలదు. 

ప్యూర్‌ వెజిటేరియన్‌.. 
రాష్ట్రపతి భవన్‌లు కొలువై ఉన్న మూడు చోట్ల రాష్ట్రపతికి సేవలు అందించేందుకు ప్రత్యేకంగా వంటమనిషితో పాటు ఇతర వ్యక్తిగత సిబ్బంది ఉంటారు. రాష్ట్రపతి దేశీయంగా ఎక్కడికి పర్యటనకు వెళ్లినా వీరే వంటలు చేస్తారు. ఈ నెల 28న రాష్ట్రపతి ముర్ముకు సారపాకలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో లంచ్‌ ఏర్పాటు చేశారు. ద్రౌపది ముర్ము శాకాహారి కావడంతో ఇప్పటికే వెజిటేరియన్‌ వంటకు సంబంధించిన మెనూను సిద్ధం చేశారు. రాష్ట్రపతి భవన్‌ చెఫ్‌తో పాటు మరికొందరు వంటగాళ్లను ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు. వీరు వండిన వంటకాలను ముందుగా భద్రతా సిబ్బంది పరీక్ష చేసిన తర్వాతే రాష్ట్రపతి, ఇతర అతిథులకు వడ్డిస్తారు. 

మరిన్ని వార్తలు