కారుకు...నో ఎంట్రీ

4 Nov, 2023 03:24 IST|Sakshi

ఆ 17 సీట్లలో నేటికీ బోణీ కొట్టని బీఆర్‌ఎస్‌ 

హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మంలో అరకొర ఫలితం 

మరో 39 చోట్ల ఒక్కోసారి, 37 చోట్ల రెండుమార్లు 

రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ  ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ప్రస్తుతం ఐదో పర్యాయం భారత్ రాష్ట్ర సమితి పేరిట శాసనసభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004, 2009 ఎన్నికల్లో ఇతర పార్టీలతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుని పోటీ చేసిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర అవతరణ నేపథ్యంలో 2014­లోనూ ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చింది.

ఇలా వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చినా నేటికీ కొన్ని సెగ్మెంట్లలో మాత్రం పట్టు సాధించలేకపోతోంది. కొరకరాని కొయ్యలుగా మిగిలి­న ఆ సెగ్మెంట్లపై ఇప్పుడు సీరియస్‌గా దృష్టి సారించిన బీఆర్‌ఎస్‌ ఇతర పార్టీలకు చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా ఈసారైనా పాగా వేయాలని  భావిస్తోంది. 

నేటికీ గెలుపు తీరాలకు చేరని నియోజకవర్గాలివే.. 
ఉమ్మడిఖమ్మం జిల్లాలోని భద్రాచలం, అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, మధిర, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందలేదు. వీటితో పాటు హైదరాబాద్‌ పాతబస్తీలోని బహదూర్‌పురా, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, గోషామహల్, కార్వాన్, నాంపల్లి, మలక్‌పేట, ఎల్‌బీనగర్, మహేశ్వరం నియోజ­కవర్గాల్లోనూ బీఆర్‌ఎస్‌ పాగా వేయలేకపోయింది.

అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత విపక్ష పార్టీ­లకు చెందిన అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, ఇల్లందు, పినపాక, ఎల్‌బీనగర్, మహేశ్వరం ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. వీరిలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ మినహా మిగతా ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎన్నికలో బీఆర్‌ఎస్‌ నుంచే బరిలోకి దిగుతున్నారు. 

2004లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల కూటమితో బీఆర్‌ఎస్‌ ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది. 
♦ 2009లో టీడీపీ, సీపీఐలతో కూడిన మహాకూటమితో బీఆర్‌ఎస్‌ ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది 
♦ 2014, 2018లో  రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో 119 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది.  

ఆయా చోట్ల ఇలా...
119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 17 చోట్ల ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌ పట్టు సాధించలేకపోయింది. మరో 39 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కేవలం ఒక్కసారే గెలుపొందగా, 37 నియోజకవర్గాల్లో రెండేసి పర్యాయాలు విజయం సాధించారు. మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు 26 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపుతీరాలకు చేరారు. 2001 నుంచి జరిగిన సాధారణ, ఉప ఎన్నికల గణాంకాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సిద్దిపేటలో అత్యధికంగా ఎనిమిది పర్యాయాలు, హుజూరాబాద్‌లో ఆరు పర్యాయాలు, వరంగల్‌ పశ్చిమలో ఐదుసార్లు గెలుపొందారు. 

పాతబస్తీలో ఎంఐఎంతో దోస్తీ 
హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మజ్లిస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉద్యమ కాలంలో పాతబస్తీలో పరిమిత సీట్లలో పోటీ చేసినా 2014, 2018 ఎన్నికల్లో మాత్రం అన్ని సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే మజ్లిస్‌ పార్టీతో మిత్రబంధం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌ పాతబస్తీలో బీఆర్‌ఎస్‌ స్నేహపూర్వక పోటీ పేరిట నామమాత్ర పోటీకి పరిమితమవుతోంది. 

అక్కడ ఈసారీ నామమాత్రపు పోటీనే? 
ప్రస్తుతం ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు స్థానాలతో పాటు ఆ పార్టీ బలంగా ఉన్న మరో రెండు సీట్లు నాంపల్లి, గోషామహల్‌లో ఈసారి కూడా బీఆర్‌ఎస్‌ నామమాత్ర పోటీకీ పరిమితమయ్యే సూచ­నలు కనిపిస్తున్నాయి. సుమారు రెండున్నర నెలల క్రితమే హైదరాబాద్‌ పాత బస్తీలోని ఏడు స్థానాలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించినా,  వారికి ఇప్పటికీ బీ ఫారాలు ఇవ్వలేదు. మరోవైపు నాంపల్లి, గోషామహల్‌ అభ్యర్థుల పేర్లను బీఆర్‌ఎస్‌ నేటికీ ఖరారు చేయలేదు.  

ఉమ్మడి ఖమ్మం జిల్లాపై చిక్కని పట్టు 
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా బీఆర్‌ఎస్‌కు పట్టు చిక్కడం లేదు. 2014లో కొత్తగూడెంలో మాత్రమే పార్టీ అభ్యర్థి జలగం వెంకట్రావు ఒక్కరే గెలుపొందారు. పాలేరుకు జరిగిన ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ తరఫున తుమ్మల నాగేశ్వరరావు గెలవడంతో పార్టీ బలం రెండుకు చేరింది. ఆ తర్వాత  చేరికల ద్వారా బలపడే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నా 2018లో జరిగిన ఎన్నికల్లోనూ  ఒక్క ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే విజయం సాధ్యమైంది.

చేరికల వ్యూహంతో మరోమారు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని లోటును పూడ్చుకునేందుకు కేసీఆర్‌ ప్రయత్నించారు. అయితే చేరికల వ్యూహం వికటించి ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు తదితరులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలకు చెందిన కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్‌బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లితో పాటు ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్‌ నియోజకవర్గాల్లో చేరికల ద్వారా బలపడేందుకు అనుసరించిన వ్యూహం 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు సానుకూల ఫలితాన్ని ఇచ్చిందనే చెప్పాలి.  

-కల్వల మల్లికార్జున్‌రెడ్డి

మరిన్ని వార్తలు