ప్రేమజంట ఆత్మహత్య

4 Nov, 2023 02:51 IST|Sakshi

పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని బలవన్మరణం

ఖమ్మం జిల్లాలో ఘటన

బోనకల్‌/వైరా: తెలిసీతెలియని వయస్సు.. ప్రేమలో పడ్డారు.. విషయం తెలియడంతో వారి కుటుంబసభ్యులు మందలించారు. ఇక పెళ్లికి వారెప్పటికీ ఒప్పుకోరనే ఆవేదనతో ఆ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో గురువారంరాత్రి చోటుచేసుకుంది. బోనకల్‌ మండలం రాపల్లికి చెందిన చింతల సుమంత్‌(18), బ్రాహ్మణపల్లికి చెందిన దారగాని ఐశ్వర్య(17) ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు.

సుమంత్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా బ్రాహ్మణపల్లిలో పనిచేసే సమయంలో ఐశ్వర్యతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ విషయం ఇద్దరి కుటుంబసభ్యులకు తెలియటంతో మందలించారు. దీంతో సుమంత్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌ పని మానేసి మూడునెలల క్రితం హైదరాబాద్‌ వెళ్లి ఓ ప్రైవేట్‌ కంపెనీలో చేరాడు. ఈ క్రమంలో గత నెల 29న ఐశ్వర్య ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు బోనకల్‌ పోలీసులకు 31వ తేదీన ఫిర్యాదు చేశారు.

అయితే, ఐశ్వర్య హైదరాబాద్‌లో ఉన్న సుమంత్‌ వద్దకు వెళ్లింది. ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై గురువారంరాత్రి వైరా రిజర్వాయర్‌ వద్దకు చేరుకుని ఓ చెట్టుకు ఉరేసుకున్నారు. శుక్రవారం ఉదయం స్థానిక రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వైరా ఏసీపీ రెహమాన్‌ ఘటనాస్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు