ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం @ రూ.3,545 

16 Dec, 2023 04:42 IST|Sakshi

మద్దతు ధర కంటే రూ.1,200 అధికం 

బాదేపల్లి మార్కెట్‌ను ముంచెత్తిన బస్తాలు 

సన్న రకానికి రికార్డు స్థాయి ధర 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం ధర రికార్డు సృష్టించింది. క్వింటాల్‌ ధర రూ.3,545 పలికింది. మహబూబ్‌గర్‌ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ చర్రితలో ఎన్నడూలేని విధంగా భారీ స్థాయి లో రేట్లు పలుకుతున్నాయి. గత సీజన్‌లో క్వింటాకు రూ.2,600 మాత్రమే పలికింది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 2,203 ఉండగా... మార్కెట్‌లో రూ. వెయ్యి నుంచి రూ.1,200 అధికంగా వస్తున్నది. బీపీ టీని అంతగా సాగు చేయకపోవడంతో సన్నాలకు డిమాండ్‌ పెరిగింది. హైదరాబాద్, మిర్యాలగూడతోపాటు ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి అవుతోంది.

అన్ని మార్కెట్లలోనూ పెద్ద మొత్తంలో ధర లభిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు జిల్లా వరకే ఈ సీజన్‌లో 1.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 3.90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. రాష్ట్ర మార్కెట్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ధరలు పలుకుతుండటం, రైతులు మార్కెట్‌కు క్యూ కట్టారు. దీంతో మార్కెట్‌కు ధాన్యం పెద్దఎత్తున అమ్మకానికి వస్తోంది. ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఆర్‌ఎన్‌ఆర్‌ సన్నరకాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు ధరలను పెంచి కొనుగోలు చేస్తున్నారు.

ఆర్‌ఎన్‌ఆర్‌ (తెలంగాణ సోన) ఈరకం బియ్యం సన్నగా ఉండటం, క్వాలిటీ బాగా ఉండటం, నూనె శాతం తక్కువ, షుగర్‌ పేషంట్లకు బాగుంటుందని డిమాండ్‌ పెరింగింది. గతంలో వేసే బీపీటీ (సోనా రకం) ధాన్యాన్ని రైతులు అంతగా సాగుచేయకపోవడం కూడా ఈ సన్నాలకు డిమాండ్‌ అధికంగా వస్తున్నది. అయితే యాసంగిలో ఎక్కువశాతం 1010 దొడ్డురకం ధాన్యం సాగుచేసే అవకాశం ఎక్కువగా ఉండటంతో వచ్చే సీజన్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు సన్నరకాలకు ధరలు అధికంగా పెట్టి కొనుగోలు చేస్తున్నారు.   
 

>
మరిన్ని వార్తలు