Israel and Hamas War: ఆ కెనాల్‌ కోసమే ఉత్తర గాజాపై దాడి

16 Dec, 2023 04:43 IST|Sakshi

గాజాపై ఇజ్రాయిల్‌ యుద్ధాన్ని ఆపమని ప్రపంచవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నా అమెరికా అండతో ఇజ్రా యెల్‌ బేఖాతరు చేస్తోంది. లక్షలాది ప్రజా నీకాన్ని గాజాలో ఉత్తర ప్రాంతం నుండి దక్షిణాదికి తరుముతూ ఇప్పటి వరకూ 20 వేల మందిని చంపింది. యుద్ధానికి ప్రధాన రహస్య ఎజెండా ‘బెన్‌ గురియన్‌ కెనాల్‌ ప్రాజెక్ట్‌’ను నిర్మించటమే అనే అనుమానం నిజమౌతోంది. ‘సూయజ్‌ కెనాల్‌’ చుట్టూ ఉన్న  క్లిష్టమైన భౌగోళిక రాజకీయ వ్యూహాలను విశ్లేషిస్తే కానీ అసలు విషయం అర్థం కాదు.  

1948 ఊచకోత (నక్బా) సమయంలో ప్రథమ ప్రధానమంత్రిగా బెన్‌–గురియన్, లక్షమంది పాలస్తీనియన్లను చంపించి, 7 లక్షల పాలస్తీనియన్‌ అరబ్బులను బలవంతంగా దేశం నుండి బహిష్కరించి ఇజ్రాయెల్‌ రాష్ట్ర స్థాపన చేశాడు. పాలస్తీనాలో యూదులకూ, అరబ్బులకూ సమాన రాజకీయ హక్కులనుకల్పించే ప్రజాస్వామ్య గణతంత్ర స్థాపనను వ్యతిరేకించాడు. అన్ని యూదు మిలిటరీ సమూహాలను ఒక కేంద్ర సంస్థగా ఏకం
చేస్తూ ఇజ్రాయెల్‌ రక్షణ దళాలను స్థాపించాడు. 1956లో గాజా, సినాయ్‌పై దాడికి ఆదేశించాడు. ఈజిప్టు నియంత్రణ నుండి సూయజ్‌ కాలువను స్వాధీనం చేసుకునేందుకు ఫ్రాన్స్, బ్రిటన్‌లు చేసిన ప్రయత్నంలో భాగస్వామిగా మారాడు. అందుకే బెన్‌ గురియన్‌ జియోనిస్ట్‌ ప్రభుత్వం అరబ్బులను మాతృభూమి నుంచి తరిమివేసినా పశ్చిమ దేశాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోలేదు.

1963లో ‘బెన్‌ గురియన్‌ కెనాల్‌ ప్రాజెక్ట్‌’ సముద్ర రవాణా మౌలిక సదుపాయాల చొరవగా భావించబడింది. ఈ ప్రాజెక్టుకు దేశ వ్యవస్థాపకుడు అయిన ‘డేవిడ్‌ బెన్‌–గురియన్‌’గా నామ కరణం జరిగింది. ప్రతిపాదిత బెన్‌ గురియన్‌ కాలువ తూర్పు మధ్యధరా తీరం వరకు విస్తరించి, గాజా ఉత్తర సరిహద్దు దగ్గర మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. కనుకనే గాజాలోని ఉత్తర ప్రాంత పాలస్తీనియన్లను ఏరివేసే పనిచేపట్టింది ఇజ్రాయెల్‌. యూరప్‌–ఆసియా మార్గంలో ఈజిప్ట్‌ను సవాలు చేస్తూ ప్రపంచ సముద్ర మార్గాలను పునర్నిర్మించటానికి ఈ నూతన కాలువను ‘గల్ఫ్‌ ఆఫ్‌ అకాబా’ (ఎర్ర సముద్రం యొక్క తూర్పు భాగం) నుండి ప్రారంభించి ‘నెగెవ్‌ ఎడారి’ (ఇజ్రాయెల్‌) ద్వారా నిర్మించా లనే ప్రతిపాదన ఉంది. గల్ఫ్‌ ఆఫ్‌ అకాబా నాలుగు దేశాలు (ఈజిప్ట్, ఇజ్రాయెల్, జోర్డాన్, సౌదీ అరేబియా) పంచుకున్న తీర రేఖను కలిగి ఉంది.

ఈ ప్రతిపాదిత కాలువ నిర్మాణంతో ఒనగూరే ఆర్థిక అవకాశాల కోసం ఇజ్రాయెల్‌ ప్రస్తుతం పాలస్తీనాపై యుద్ధం చేస్తుందనిపిస్తోంది. సూయజ్‌ కెనాల్‌కు ప్రత్యామ్నాయాన్ని రూపొందించడానికి అమెరికా సరఫరా చేసే 520 అణుబాంబులను ఉపయోగించాలనే ప్రతిపాదనను ఇజ్రాయెల్‌ 1963లో పరిగణన లోకి తీసుకున్నది. ఒక డీ క్లాసిఫైడ్‌ మెమోరాండం ప్రకారం... ఇజ్రా యెల్‌ నెగెవ్‌ ఎడారి గుండా సముద్ర మట్ట కాలువకు 160 మైళ్ల
కంటే ఎక్కువ త్రవ్వకాలు జరిపి ఉండేదని చరిత్రకారుడు అలెక్స్‌ వెల్లర్‌ స్టెయిన్‌ అంటున్నాడు. ప్రతి మైలుకు నాలుగు 2–మెగా టన్నుల పరికరాలు అవసరమని మెమోరాండం అంచనా వేసింది. ‘‘దీనిని వెల్లర్‌స్టెయిన్‌ ‘520 న్యూక్స్‌’ అని వ్యవహరిస్తా’’రని అలెక్స్‌ వెల్లర్‌ స్టెయిన్‌ ట్వీట్‌ చేశాడు. ఈ ప్రణాళికను ‘సూయజ్‌ కెనాల్‌కు ప్రత్యమ్నాయ ప్రతిపాదన’గా పేర్కొన్నాడు.  

సూయజ్‌ కెనాల్‌ 1869లో ప్రారంభించబడిన మానవ నిర్మిత జలమార్గం. ఇది ఈజిప్ట్‌లోని సూయజ్‌ యొక్క ఇస్త్మస్‌ మీదుగా ఉత్తరం నుండి దక్షిణం వైపు ప్రవహిస్తూ, మధ్యధరా సముద్రాన్ని  ఎర్ర సముద్రంతో కలుపుతోంది. యూరప్‌ ఆసియా మధ్య నౌకా యాన దూరాన్ని గణనీయంగా తగ్గిస్తోంది. ఆఫ్రికా ఖండాన్ని ఆసియా నుండి వేరు చేసే ఈ కాలువ 150 సంవత్సరాల క్రితం తవ్వినది. కాలువ ప్రారంభంలో బ్రిటిష్, ఫ్రెంచ్‌ ప్రయోజనాలకు ఉపయోగపడేది. అయితే ఈజిప్ట్‌ 1956లో దీన్ని జాతీయం చేసింది. దీంతో ఈ కాలువపై ఈజిప్టు ఆధిపత్యం ఏర్పడింది. ప్రస్తుతం ఈజిప్టు జీడీపీలో దాదాపు 2 శాతం వాటా ఈ కాలువ ద్వారా సరుకు రవాణా చేసే నౌకలపై విధించిన టోల్‌ రుసుము ద్వారానే లభిస్తోంది. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 12 శాతం సూయజ్‌ కెనాల్‌ గుండా సాగుతోంది. 

ఈ పరిస్థితుల్లో బెన్‌–గురియన్‌ కాలువ నిర్మాణం జరిగితే ప్రపంచ వాణిజ్య, భౌగోళిక రాజకీయాలపై గణనీయమైన ప్రభావం పడుతుంది. యూరప్‌– ఆసియా మధ్య కొత్త నౌకా రవాణా మార్గాన్ని సృష్టించి ప్రపంచ నౌకా రవాణాపై ఇజ్రాయెల్‌ ఆధిపత్యం చెలాయించాలనే తపనతో ఉత్తర గాజా ప్రాంతవాసుల్ని దక్షిణం వైపునకుగానీ, వేరే దేశాలకుగానీ శరణార్థులుగా పొమ్మంటున్నదనే ఆలోచనలు బలపడుతున్నాయి. 

వ్యాసకర్త అసోసియేట్‌ ప్రొఫెసర్,
కె.ఎల్‌. యూనివర్సిటీ 

>
మరిన్ని వార్తలు