2020నాటి ఎల్‌ఆర్‌ఎస్‌కు లైన్‌ క్లియర్‌!

27 Feb, 2024 01:47 IST|Sakshi

మార్చి 31నాటికి అక్రమ లేఅవుట్ల క్రమబద్ధికరణకు రాష్ట్ర సర్కారు నిర్ణయం 

ప్లాట్‌ క్రమబద్ధికరణకు రూ.1,000, లేఅవుట్‌కు రూ.10,000 ఫీజుతో 2020లో దరఖాస్తులు స్వీకరించిన సర్కారు 

గ్రామ పంచాయతీల్లోని లేఅవుట్లతోపాటు వ్యక్తిగత ప్లాట్లను క్రమబద్ధికరించే చాన్స్‌ 

దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు కేసులున్న భూములకు మినహాయింపు 

ఆదాయ సమీకరణ ప్రయత్నాల నేపథ్యంలో తెరపైకి ‘ఎల్‌ఆర్‌ఎస్‌’ 

రెగ్యులరైజేషన్‌ చార్జీ చెల్లింపునకు తక్కువ గడువు ఇవ్వడంపై అభ్యంతరాలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లేఅవుట్ల క్రమబద్ధికరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020 సంవత్సరంలో ప్లాట్‌ ఓనర్లు, లేఅవుట్లు చేసిన రియల్టర్ల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి క్రమబద్ధికరించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని రెవెన్యూ విభాగాల నుంచి ఆదాయ సమీకరణపై సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

మార్చి 31లోగా మొత్తం రుసుము చెల్లించిన పక్షంలో సదరు ప్లాట్ల క్రమబద్ధికరణకు అవకాశం కల్పించనున్నారు. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ, కోర్టు ఆదేశాలున్న భూములు మినహా ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించనున్నారు. సుమారు 20 లక్షల మంది దరఖాస్తుదారులకు దీనితో ప్రయోజనం చేకూరుతుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. 

ఆదాయ సమీకరణ దిశగా.. 
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో అనుమతుల్లేని లేఅవుట్లలో ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో కేసీఆర్‌ సర్కారు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని తెచ్చింది. ఆ ఏడాది అక్టోబర్‌ 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. ప్లాట్లకు సంబంధించి రూ.1000 చొప్పున, లేఅవుట్లకు రూ.10,000 చొప్పున దరఖాస్తు ఫీజు తీసుకుంది. ఈ పథకం కింద 100 గజాల్లోపు ప్లాటు రెగ్యులరైజేషన్‌ కోసం గజానికి రూ.200 చొప్పున చార్జీ చెల్లించాలి.

100 నుంచి 300 గజాల వరకు ఉన్న స్థలాలకు గజానికి రూ.400.. 300 గజాలకుపైన ఉంటే గజానికి రూ.600 చొప్పున చార్జీ చెల్లించాలని పేర్కొంది. అయితే.. లేఅవుట్ల క్రమబద్ధికరణ అంశంపై న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. పెండింగ్‌ దరఖాస్తుల సంగతి ఏమిటన్నది అయోమయంగా మారింది. తాజాగా ఆదాయ సమీకరణపై సీఎం సమీక్ష సందర్భంగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నారు. తద్వారా సర్కారుకు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. దీనిపై అధికారికంగా విధి విధానాలు విడుదల కావాల్సి ఉంది. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీల చెల్లింపు కోసం తక్కువ గడువు పెట్టడం ఏమిటన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 

సర్కారుకు రూ. 50 వేల కోట్ల ఆదాయం వచ్చే చాన్స్‌ 
2020 నాటి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిశీలించి క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయం. వేలాది మంది రియల్టర్లు, లక్షల మంది కొనుగోలుదారులకు గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లకు అనుమతి లభిస్తుంది. అయితే మార్చి 31లోగా ఎల్‌ఆర్‌ఎస్‌ క్రమబద్ధికరణ చార్జీల మొత్తాన్ని చెల్లించాలనే నిబంధనను సడలించాలి. కేవలం నెల రోజుల్లో లక్షల రూపాయలు చెల్లించి ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకునే స్తోమత ప్లాట్ల యజమానులు, రియల్టర్లకు ఉండదు. ఈ విషయంలో పునరాలోచించాలి. ప్రస్తుతం సుమారు 25 లక్షల ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవ్వన్నీ క్లియర్‌ అయితే ప్రభుత్వానికి రూ. 50 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. – నారగోని ప్రవీణ్‌కుమార్, ప్రెసిడెంట్,తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌ 

whatsapp channel

మరిన్ని వార్తలు