నమోదులో తప్పులు .. రైతుల తిప్పలు

11 Jan, 2022 04:10 IST|Sakshi

వాటిని సరి చేసుకునేందుకు దరఖాస్తు ఇచ్చినా ఫలితం శూన్యం

ఇక పాసు పుస్తకం అయితే ఏళ్లు గడవాల్సిందే

వీటి కోసం 25 లక్షల ఎకరాలకు చెందిన రైతుల ఎదురుచూపులు 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామానికి చెందిన దాయాదుల మధ్య భూమి పంచాయితీ వచ్చింది. ఈ పంచాయితీ కారణంగా ఒకరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో భూరికార్డుల ప్రక్షాళన సమయంలో ఆ భూమిని పార్ట్‌–బీలో పెట్టారు. ఆ భూమిపై ఎవరికీ పాసు పుస్తకాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ దాయాదుల మధ్య రాజీ కుదిరింది. భూమి పంపకాలపై ఓ స్పష్టత వచ్చింది. దీంతో దాయాదులు పాత పట్టాదారు పేరు మీద పాసు పుస్తకం కోసం ధరణిలో దరఖాస్తు చేసుకునేందుకు వెళితే సాఫ్ట్‌వేర్‌ అంగీకరించడం లేదు. ఈ భూమిపై ఏదో కేసు ఉందని చెబుతోంది. ఏం కేసు ఉందో, కేసు నంబర్‌ ఏంటో.. వివరాలు తెలియక, ఏం చేయాలో లబోదిబోమంటున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: భూములకు సంబంధించిన హక్కులు, వాటి రికార్డుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రెవెన్యూ యంత్రాంగం చేసిన తప్పుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పాసుపుస్తకాల కోసం చేసుకున్న దరఖాస్తులు ఎటు వెళ్లాయో కూడా అర్థం కాక రాష్ట్రంలోని దాదాపు 25 లక్షలకు పైగా ఎకరాలకు చెందిన రైతులు తలలు పట్టుకుంటున్నారని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. ఇదిలావుంటే వచ్చిన పాసు పుస్తకాల్లో తప్పులు సరిచేసేందుకు ధరణి పోర్టల్‌ ద్వారా చేసుకున్న దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు.

పాసుపుస్తకాల్లో పేరు, ఊరు, తండ్రిపేరు, విస్తీర్ణం, భూమి రకం, సంక్రమించిన విధానం... ఇలా పలు అంశాల్లో రెవెన్యూ సిబ్బంది నిర్వాకం కారణంగా దొర్లిన తప్పులు రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. వీటిని సవరించాలంటూ పెట్టుకున్న దరఖాస్తులు కలెక్టర్ల లాగిన్‌లలోనే ఉండిపోతున్నాయి. ఈ దరఖాస్తులను రెవెన్యూ సిబ్బంది కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని, కలెక్టర్లకు నివేదికలు పంపడం లేదని తెలుస్తోంది. దీంతో తప్పుల సవరణలకు సంబంధించిన దరఖాస్తులు నెలలు, ఏళ్ల తరబడి అలా పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. 

గుట్టలుగా పాసుపుస్తకాలు
ఇక, కొత్త పాసుపుస్తకాల కోసం చేసుకున్న దరఖాస్తులు అతీగతీ లేకుండా పోతున్నాయి. ఈ పాసుపుస్తకాలను బయట ముద్రించాల్సి ఉండడం, వాటిని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) ద్వారా రైతులకు పంపాల్సి ఉండడంతో అసలు ఆ పుస్తకాలను ముద్రించారో లేదో కూడా అర్థం కావడం లేదు. మరోవైపు, ముద్రించిన పాసుపుస్తకాలు గుట్టల కొద్దీ సీసీఎల్‌ఏ కార్యాలయంలో పేరుకుపోతున్నాయని, వాటిని రైతులకు పంపేందుకు గాను అవసరమైన స్టాంపులు కొనేందుకు కూడా సీసీఎల్‌ఏ వర్గాల వద్ద నిధుల్లేవని తెలుస్తోంది. దీంతో వచ్చిన పుస్తకాలు వచ్చినట్టు సీసీఎల్‌ఏ కార్యాలయంలో ఉండిపోతున్నాయే తప్ప రైతుల దరి చేరడం లేదు. 

ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి
రైతుల భూములకు సంబంధించిన పాసుపుస్తకాలు, ఆ పుస్తకాల్లో నమోదైన తప్పులు, భూరికార్డుల ప్రక్షాళనలో పార్ట్‌బీ (వివాదంలో ఉన్న భూములు) కింద నమోదు చేసిన భూముల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రైతు సంఘాలంటున్నాయి. లేకపోతే ఈ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం కనిపించడం లేదని పేర్కొంటున్నాయి. 

మరిన్ని వార్తలు