కాంగ్రెస్‌లో ముసలం: రేవంత్‌రెడ్డిపై సీనియర్ల తిరుగుబాటు

17 Dec, 2022 13:36 IST|Sakshi

సాక్షి, కాంగ్రెస్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్తగా ఏర్పాటైన కమిటీలు కాకరేపుతున్నాయి. తమకు సరైన ప్రాధాన్యం లభించలేదంటూ సీనియర్‌ నేతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీల్లో ఉన్న సగానికిపైగా టీడీపీ నుంచి వచ్చిన వారేనని, అసలు ఒరిజినల్‌ కాంగ్రెస్‌ తమదేనని స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లి కొత్త కమిటీలపై తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు కొత్త కమిటీలు, నేతల అసంతృప్తిపై సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో టీకాంగ్రెస్‌ నేతలు శనివారం సమావేశమయ్యారు. ఈ భేటీపై మీడియాతో మాట్లాడారు సీనియర్‌ నేతలు. 

‘కమిటీల్లో అన్యాయం జరిగిందని చాలా మంది చెప్పారు. అసంతృప్తిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తాం. కాంగ్రెస్‌ పార్టీని రక్షించుకోవటం ప్రతి ఒక్కరిపై ఉంది. సేవ్‌ కాంగ్రెస్‌ కార్యక్రమంతో ముందుకు సాగాలని నేతలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్తాం. కొందరు కావాలనే బలమైన నేతలు, పార్టీకి నష్టం చేకూర్చేలా ప్రవర్తిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని చర్చకు వచ్చింది.’ అని తెలిపారు సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క. 

సగానికిపైగా టీడీపీ నుంచి వచ్చినవారే: ఉత్తమ్‌
సీఎల్‌పీ నేత ఇంట్లో జరిగిన సమావేశంలో పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించామన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ ఒక ప్రజాస్వామ్య పార్టీ అని పేర్కొన్నారు. సేవ్‌ కాంగ్రెస్‌ నినాదంతో ముందుకెళ్తున్నామని, కాంగ్రెస్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

‘కొంతమందిని అవమానించడానికే కొత్త కమిటీ ప్రకటించినట్లుంది. 108 మందిలో సగానికిపైగా టీడీపీ నుంచి వచ్చినవారే ఉన్నారు. సోషల్‌ మీడియాలో నేతలపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. కొంత మంది అసత్యప్రచారం చేయిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నవారు చేయలేనిది రేవంత్‌ చేస్తారా? అధిష్టానానికి అవగాహన లేకుండానే కొందరు చెబితే కమిటీ వేశారు. ఒరిజినల్‌ కాంగ్రెస్‌ను కాపాడుకోవడమే మా లక్ష్యం. కావాలని సోషల్‌ మీడియాలో మాపై బురదజల్లుతున్నారు. సీఎల్‌పీ నేతను అవమానిస్తున్నారు. ’ అని ధ్వజమెత్తారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

ఇదీ చదవండి: వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో అప్పుడు చెబుతాను.. ట్విస్ట్‌ ఇచ్చిన కోమటిరెడ్డి!

మరిన్ని వార్తలు