ప్రాజెక్టుల పరిశీలనకు కృష్ణా, గోదావరి బోర్డులు

25 Oct, 2021 08:24 IST|Sakshi

దేవాదుల, ఎస్సారెస్పీ పరిధిలో గోదావరి.. శ్రీశైలం పరిధిలో కృష్ణా బోర్డు సబ్‌ కమిటీల పర్యటన 

సాక్షి, హైదరాబాద్‌: ప్రాజెక్టుల స్వాధీనంపై కేంద్రం వెలువరించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు దిశగా తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు కృష్ణా, గోదావరి బోర్డులు స్వయంగా రంగంలోకి దిగుతున్నాయి. ప్రాజెక్టుల స్వాధీనం దిశలో ఉన్న అవాంతరాలు, వాస్తవిక పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రాజెక్టుల పరిధిలో పర్యటించనున్నాయి. సోమవారం నుంచి గోదావరి బోర్డు సబ్‌కమిటీ దేవాదుల, ఎస్సారెస్పీ పరిధిలో పర్యటించనుండగా, కృష్ణా బోర్డు సబ్‌కమిటీ శ్రీశైలంలో పర్యటించనుంది.

నిజానికి అక్టోబర్‌ 14 నుంచి గెజిట్‌ అమలు కావాల్సి ఉన్నా ఇంతవరకు ప్రాజెక్టుల స్వాధీనంపై స్పష్టత లేక అనిశ్చితి కొనసాగుతోంది. కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల పరిధిలో 15 ఔట్‌లెట్‌ల స్వాధీనానికి బోర్డులు తీర్మానించినా, తెలంగాణ నుంచి అంగీకారం కుదరక అడుగు ముందుకు పడటం లేదు. ఈ అనిశ్చితి కొనసాగుతుండగానే రవికుమార్‌ పిళ్లై, డీఎం రాయ్‌పురేల నేతృత్వంలోని కృష్ణా బోర్డు సబ్‌కమిటీ శ్రీశైలం పరిధిలో పర్యటించాలని నిర్ణయించింది.

శ్రీశైలంలో కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాలు, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుల పరిధిలో ఉన్న సిబ్బంది, ఆపరేషన్‌ ప్రొటోకాల్, వరద నియంత్రణ పద్ధతులు, ఇతర పథకాలకు నీటి అవసరాలు, వినియోగం తదితర అంశాలపై స్థానిక ఇంజనీర్లతో చర్చించనుంది. ఇక కేంద్ర జల సంఘం సీఈ అతుల్‌కుమార్‌ నాయక్‌ నేతృత్వంలోని గోదావరి బోర్డు సబ్‌ కమిటీ దేవాదులలోని గంగారం పంప్‌హౌస్, ఎస్సారెస్పీ పరిధిలోని కాకతీయ కెనాల్‌ పరిధిలోని క్రాస్‌ రెగ్యులేటర్‌ను పరిశీలించనుంది. షెడ్యూల్‌–2లో పేర్కొన్న ఈ ప్రాజెక్టులను బోర్డులు స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా, స్వాధీనం అనంతరం ఉండే పరిస్థితులు, వాటి నిర్వహణపై కమిటీలు అధ్యయనం చేయనున్నాయి.

చదవండి: Hyderabad RTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సిటీ బస్సు ఇక చిటికలో

మరిన్ని వార్తలు