తల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే పాఠశాలకు

23 Feb, 2021 19:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుంచి 6,7,8 తరగతులను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా తరగతులను ప్రారంభించాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. స్థానిక ఏర్పాట్లను బట్టి 6,7,8 తరగతులను రేపటి నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు ప్రారంభించుకోవచ్చని మంత్రి సూచించారు. 6,7,8 తరగతుల ప్రారంభోత్సవంపై బుధవారం విద్యా శాఖ అధికారులతో తన కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, డైరెక్టర్ దేవసేన, సత్యనారాయణరెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే విద్యార్థులను తరగతులకు అనుమతించాలని మంత్రి స్పష్టం చేశారు.

పాఠశాలకు హాజరు కావాలన్న వత్తిడి విద్యార్థులపై చేయకూడదని ఆయా యాజమాన్యాలకు మంత్రి స్పష్టం చేశారు. తరగతులకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా కోవిడ్ మార్గదర్శకాలను విధిగా పాటించాలని మంత్రి కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల్లోనూ ప్రత్యేకంగా శానిటైజేషన్ ప్రక్రియను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్ధులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని భౌతిక దూరం పాటించాలని మంత్రి కోరారు, 6,7,8 తరగతులకు ఇప్పటి వరకు ఆన్లైన్లో పాఠాలను బోధించడం జరిగిందని, ఇకపై ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు.

ప్రత్యక్ష తరగతులకు హాజరు కాని విద్యార్థుల కోసం ఆ తరగతుల బోధన కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల 17.10 లక్షల మంది విద్యార్థులు తరగతులకు హాజరు అయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ విద్యా శాఖ పరిధిలోని 8,891 పాఠశాలల్లో 8,88, 742 మంది, 10,275 ప్రైవేట్ పాఠశాలల్లోని 8,28,516 మంది విద్యార్థులు, వివిధ సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న 1157 గురుకుల విద్యా సంస్థల్లో 1,98, 853 మంది విద్యార్థులు 6,7,8 తరగతులు చదువుతున్నారని మంత్రి తెలిపారు.

ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖాధికారులను ఆదేశించారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటించడంలో రాజీపడకూడదని మంత్రి స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు కూర్చునేందుకు తరగతి గదులు తక్కువగా ఉంటే షిప్ పద్దతిలో పాఠశాలను నడుపుకునేందుకు అనుమతిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటించడంలో రాజీపడకూడదని మంత్రి స్పష్టం చేశారు

మరిన్ని వార్తలు