ఇక ప్లాస్టిక్‌ నిషేధం!

30 Jul, 2020 03:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగిల్‌ యూజ్‌ (ఒకసారి వాడి పడేసే) ప్లాస్టిక్‌ వినియోగం, విక్రయాలు, నిల్వలపై భారీ జరిమానాలతో కొరడా ఝళిపించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ సిద్ధమైంది. తమ ప్రాంత పరిధిలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ను నిషేధిస్తూ నోటిఫికేషన్లు జారీ చేయాలని రాష్ట్రంలోని అన్ని పురపాలికలను ఆదేశించింది.  ప్లాస్టిక్‌తో పర్యావరణానికి జరుగుతున్న హాని గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని సూచించింది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకం, అమ్మకాలు, నిల్వలు జరపరాదని రిటైలర్లను కోరాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఉత్సవాలు, సామూహిక కార్యక్రమా ల్లో దీని వాడకాన్ని నియంత్రించాలని పేర్కొంది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

జరిమానాలు.. 
► రిటైలర్లు, విక్రేతలు, వ్యాపార సముదాయాలు తొలిసారిగా ప్లాస్టిక్‌ నిషేధాన్ని ఉల్లంఘిస్తే రూ.2,500 నుంచి రూ.5000 వరకు జరిమానా విధిస్తారు. మళ్లీ ఉల్లంఘిస్తే మున్సిపల్‌ చట్టంలోని నిబంధనల ప్రకారం ట్రేడ్‌ లైసెన్సును రద్దు చేస్తారు.  
► బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులను పడేసే వ్యక్తులపై ప్రతిసారీ రూ.250 నుంచి రూ.500 వరకు జరిమానా వేస్తారు.  
► బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఉత్సవాలు, సామూహిక కార్యక్రమాల్లో నిషేధించిన ప్లాస్టిక్‌ వస్తువులు వినియోగిస్తే రూ.50 వేల జరిమానా విధిస్తారు. 

మరిన్ని వార్తలు