ఆగే గుండెకు ఆయువు పోస్తుంది..

22 Aug, 2020 03:43 IST|Sakshi

అపర సంజీవని ఎక్మో 

గుండె, ఊపిరితిత్తుల పనిని ఇదే చేసేస్తుంది 

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఇదే ప్రక్రియలో వైద్యం 

ఇటీవల హైదరాబాద్‌లోని ఒక వైద్యుడికి విజయవంతంగా చికిత్స 

అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఎక్మోతో ఎంతో మేలు 

సాక్షి, హైదరాబాద్‌: ఎక్మో మెషీన్‌.. ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ప్రస్తుతం ఈ యంత్రం మీదే చికిత్స అందిస్తున్నారు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌ కేర్‌ ఆసుపత్రి వైద్యులు కూడా కరోనాతో సీరియస్‌ కండిషన్‌లో ఉన్న వరంగల్‌ జిల్లాకు చెందిన పిల్లల డాక్టర్‌ దయానంద్‌ సాగర్‌కు ఎక్మో పద్ధతిలోనే విజయవంతంగా చికిత్స చేశారు. 2016లోనూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకూ ఇదే పద్ధతిలో చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో ఈ అత్యాధునిక చికిత్సా విధానంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది.. ఇంతకీ ఏంటీ ఎక్మో? 

అపర సంజీవనే.. 
సుదీర్ఘ అస్వస్థత నుంచి కోలుకుంటున్న దశలో ఉన్నట్టుండి గుండెపోటు ముంచుకు వచ్చే సమయంలో అత్యవసరంగా ఈ ఎక్స్‌ట్రాకార్పోరియల్‌ మెంబరే ఆక్సిజనేషన్‌(ఎక్మో) యంత్రం మీద ఉంచి చికిత్స అందిస్తారు. కీలక ఘడియల్లో ఊపిరితిత్తుల పనిని, అవసరమైతే గుండె పనిని కూడా బయటే పూర్తిచేసి శరీరాన్ని నిలబెట్టే సంక్లిష్టమైన ప్రత్యేక చికిత్సా విధానం ఇది. వెంటిలేటర్‌తో కూడా ఉపయోగం లేని సందర్భాల్లో రోగి ప్రాణ రక్షణ కోసం ‘ఎక్మో’చికిత్సా పద్ధతి కీలకమైంది. ఎందుకంటే మన శరీరంలోని ప్రతి కణానికీ రక్తం అవసరం.

రక్తం నిరంతరాయంగా అందుతుంటేనే శరీరంలోని కణాలు, అవయవాలన్నీ సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఏదైనా కారణంతో రక్త సరఫరా నిలిచిపోతే ఆ కణాలు చచ్చిపోతాయి. మృత్యువు ముంచుకొస్తుంది. అలాగే రక్తాన్ని శరీరమంతా సరఫరా చేసేది గుండె. ఆక్సిజనేషన్‌(రక్తంలోకి ఆక్సిజన్‌ను చేర్చడం) చేసేది ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోతే ఆక్సిజనేషన్‌ జరగదు. దీంతో ప్రాణవాయువు(ఆక్సిజన్‌) లేని చెడు రక్తమే ఒళ్లంతా తిరుగుతుంటుంది. ఆక్సిజన్‌ తగినంత అందక అవయవాలన్నీ దెబ్బతినిపోతుంటాయి. అందుకే గుండె, ఊపిరితిత్తులూ రెండూ సమర్థంగా పనిచేస్తుండటం చాలా అవసరం. 

‘ఎక్మో’ఏం చేస్తుందంటే?  
ఎవరికైనా గుండె, ఊపిరితిత్తులు రెండూ విఫలమైపోతే అప్పుడు ఎక్మో పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ యంత్రంలో రోగి శరీరంలోని రక్తనాళాల్లోకి, లేదా నేరుగా గుండెలోకి అమర్చేందుకు ప్రత్యేకమైన గొట్టాలుంటాయి. ఈ గొట్టాలను రోగి మెడ దగ్గర నుంచి గానీ, తొడ దగ్గరగానీ లోనికి పంపి రక్తనాళాల్లో అమరుస్తారు. ఈ గొట్టాలను బయట ఎక్మో యంత్రానికి అనుసంధానిస్తారు. ఇది రోగి రక్తాన్ని ఒక గొట్టం ద్వారా బయటకు తీసుకువచ్చి, యంత్రంలో ఆక్సిజనేషన్‌ చేసి, ప్రాణవాయువుతో కూడిన మంచి రక్తాన్ని శరీరంలోని వివిధ భాగాలకు అందిస్తుంది. అంటే ఊపిరితిత్తులు, గుండె ఈ రెండింటి పనినీ ఎక్మో బయట నుంచి చేస్తుందన్నమాట.

గుండె, ఊపిరితిత్తుల పనిని బయటే కృత్రిమంగా చేయిస్తుండటం వల్ల వాటికి విశ్రాంతి దొరుకుతుంది. తద్వారా అవి త్వరగా కోలుకుంటాయి. అలాగే శరీరంలో అవయవాలు దెబ్బతినే ప్రమాదమూ తప్పుతుంది. ఉన్నట్టుండి గుండె లేదా ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతిన్న వాళ్లకు ఇది ప్రయోజనకరం. ఎక్మో విధానంలో రెండు మూడు వారాల పాటు చికిత్స ఇవ్వవచ్చు. ఊపిరితిత్తుల వైఫల్యం కారణంగా ఎక్మో పెట్టిన వాళ్లకు ఫలితాలు బాగుంటున్నాయి. వీరు 70–80 శాతం వరకూ కోలుకుంటున్నారు. గుండె దెబ్బతినటం వల్ల ఎక్మో పెట్టిన వాళ్లలో ఫలితాలు అంత గొప్పగా ఉండటం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

కొంత సంక్లిష్టత.. మరికొన్ని సమస్యలు 
ఎక్మో చికిత్స కోసం రక్తాన్ని బయటకు తీసుకువచ్చేందుకు, మళ్లీ లోపలికి పంపేందుకు గొట్టాలను అమర్చటమే కష్టం. రక్తస్రావం అవడం, రక్తపు గడ్డలు ఏర్పడటం, రక్త నాళాలు చిట్లిపోవటం వంటి సమస్యలన్నీ ఉంటాయి. ఇన్ఫెక్షన్లు రావచ్చు. అలాగే రక్తాన్ని బయట శుద్ధి చేస్తుండే క్రమంలో కొన్నిసార్లు రక్తంలోని ప్లేట్‌లెట్లు, తెల్లరక్తకణాల వంటివి దెబ్బతినిపోతుంటాయి. ఇది మరో సమస్య. అయితే వైద్యులు వీటిని నిరంతరాయంగా పర్యవేక్షిస్తుంటారు.  

వీళ్లకు బాగా ఉపయోగం.. 
పుట్టుకతోనే గుండె లోపాలు లేదా పుట్టగానే శ్వాస సమస్యలతో బాధపడే చిన్నపిల్లల్లో ఎక్మో విస్తృతంగా వాడకంలో ఉంది. పెద్దల్లో కూడా ఊపిరితిత్తులు దెబ్బతిని, అవి సరిగా పని చేయని సంద ర్భాల్లో ఈ విధానాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. మరికొందరికి వైరస్‌ ఇన్ఫెక్షన్ల కారణంగా ఉన్నట్టుండి గుండె కండరం విపరీతంగా వాచిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో గుండె పంపింగ్‌ పూర్తిగా దెబ్బతినిపోతుంది. ఇలాంటి వారికి వైరస్‌ ఇన్ఫెక్షన్‌ తగ్గే వరకూ ‘ఎక్మో’బాగా ఉపయోగపడుతుంది.

రక్తంలో ఇన్ఫెక్షన్‌ చేరిపోయి తీవ్రమైన ‘సెప్సిస్‌’ఉన్న వాళ్లకు.. రక్తంలోని విషతుల్యాల వల్ల ఒక్కోసారి గుండె పని ఆగిపోతుంది. ఇలాంటి వారికి కూడా తాత్కాలికంగా ఇది బాగా ఉపయోగపడుతుంది. తీవ్రమైన నిమోనియా వచ్చి రెండు ఊపిరితిత్తులూ పని చేసే స్థితిలో లేనప్పుడు కూ డా ఇది ఆదుకుంటుంది. రోగి ఊపిరితిత్తులు బాగుపడుతున్న కొద్దీ, లేదా గుండె పంపింగ్‌ మెరుగవుతున్న కొద్దీ ఎక్మో మీద ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ వచ్చి చివరకు దీన్ని వైద్యులు పూర్తిగా తీసేస్తారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు