30 రోజుల్లో మాదకద్రవ్య రహిత తెలంగాణ 

25 Oct, 2021 03:48 IST|Sakshi
డ్రగ్‌ రాకెట్‌ ను పట్టుకున్న ఎక్సైజ్‌ శాఖ అధికారులను అభినందిస్తున్న మంత్రి  శ్రీనివాస్‌ గౌడ్‌   

సరిహద్దులు మరింత పటిష్టం 

కార్యాచరణ రూపొందిస్తున్న ఎక్సైజ్‌ అధికారులు 

మెపిడ్రిన్‌ పట్టుకున్న ఎక్సైజ్‌ అధికారులను సన్మానించిన మంత్రి  

సాక్షి, హైదరాబాద్‌: రానున్న 30 రోజుల్లో రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత తెలంగాణగా మార్చాలని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది. డ్రగ్స్, గంజాయి, గుడుంబాలపై ఉక్కుపాదం మోపేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దులపై ప్రత్యేక నిఘాతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను మరింత పటిష్టం చేయనున్నారు.

మత్తు పదార్థాలను తయారు చేస్తున్న వారితో పాటు రవాణా, అమ్మకం, వినియోగం చేస్తున్న వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు ఎక్సైజ్‌ అధికారులు. రాష్ట్ర పోలీసు శాఖ సహకారంతో గంజాయి సాగు, రవాణా జరిగే ప్రాంతాలను గుర్తించడంతో పాటు గుడుంబా వినియోగం పెరగకుండా తయారీదారులకు పునరావాస ప్రక్రియ అమలు చేయనున్నారు.

ఎక్సైజ్‌ అధికారులకు మంత్రి సన్మానం 
కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.2కోట్లకు పైగా విలువ ఉండే సుమారు 5 కిలోల మెపిడ్రిన్‌ డ్రగ్స్‌ను పట్టుకున్న ఎక్సైజ్‌ అధికారులను ఆ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ డేవిడ్‌ రవికాంత్, రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ చంద్రయ్య, మేడ్చల్‌ ఈఎస్‌ విజయ్‌భాస్కర్, సీఐ సహదేవ్‌లతో పాటు వారి సిబ్బందిని శాలువాలతో ఆయన సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్సైజ్‌ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. ఎక్సైజ్‌ శాఖకు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచాలని, దాడి చేసి పట్టుకునేంతవరకు నేరస్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. టాస్క్‌ఫోర్స్‌ మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు.

మరిన్ని వార్తలు