ఎంత ఫిట్‌మెంట్‌కు ఎంత భారం!

17 Dec, 2020 02:55 IST|Sakshi

పీఆర్‌సీపై లెక్కలు వేస్తున్న ఆర్థిక శాఖ..

ఏపీలో 27 శాతం మధ్యంతర భృతి అమలు

అంతకు తక్కువ కాకుండా ప్రకటించాలని వాదన 

ప్రస్తుతం 30% ఇస్తే ఏడాదికి రూ.6,750 కోట్లు..  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పీఆర్‌సీ అమలు వైపు అడుగులు పడ్డాయి. ఇప్పటికే పీఆర్‌సీ కమిషన్‌ తమ నివేదికను సిద్ధం చేయగా, ఆర్థిక శాఖ ఎంత ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని అమలు చేస్తే ఎంత మొత్తాన్ని ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తుందన్న అంచనాలపై కసరత్తు చేస్తోంది. నిత్యావసర ధరల పెరుగుదల సూచీ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెంపుదల చేయడమే ఫిట్‌మెంట్‌ అయినా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పీఆర్‌సీ కమిటీ ఎంత సిఫారసు చేస్తుంది.. సీఎం కేసీఆర్‌ ఎంత ఖరారు చేస్తారన్న దానిపై ఉద్యోగుల్లో చర్చ జోరందుకుంది. 

మొత్తంగా 5.29 లక్షల మందికి.. 
ఆంధ్రప్రదేశ్‌లో 27 శాతం మధ్యంతర భృతిని (ఐఆర్‌) అమలు చేస్తున్న నేపథ్యంలో అంతకంటే తక్కువ ఇస్తే ఇక్కడ ఉద్యోగులు ఒప్పుకోరన్న వాదన ఉంది. దీంతో 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలన్న అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎంత ఫిట్‌మెంట్‌కు ఎంత మొత్తం వెచ్చించాల్సి వస్తుంది.. ప్రభుత్వంపై పడే అదరపు భారం ఎంత అన్న దానిపై ఆర్థిక శాఖ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2.62 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, 2.67 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తంగా 5.29 లక్షల మందికి పీఆర్‌సీని అమలు చేయాల్సి ఉంది.

వారికి ఒక్క శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేస్తే ఏటా అదనంగా రూ.225 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. దాని ప్రకారం ఒక్క శాతం నుంచి మొదలుకొని 35 శాతం వరకు ఫిట్‌మెంట్‌ ఇస్తే వెచ్చించాల్సిన మొత్తంపై అంచనాలు వేస్తున్నాయి. ఆ లెక్కన రాష్ట్రంలోని ఉద్యోగులకు 20 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే రూ.4,500 కోట్లు, 22 శాతం ఇస్తే రూ.4,950 కోట్లు, 24 శాతం ఇస్తే రూ.5,400 కోట్లు, 25 శాతం ఇస్తే రూ.5,625 కోట్లు, రూ.27 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే రూ.6,075 కోట్లు, 30 శాతం ఇస్తే 6,750 కోట్లు, 35 శాతం ఇస్తే రూ.7,875 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని లెక్కలు వేస్తున్నాయి.  

అవి భర్తీ అయితే రూ.9 వేల కోట్లకు.. 
ఇక ఇప్పటికే ఉద్యోగులకు రెండు కరువు భత్యాలను (డీఏ) చెల్లించాల్సి ఉంది. మరోవైపు ప్రస్తుతం శాఖల వారీగా మంజూరైన పోస్టులు, పని చేస్తున్న ఉద్యోగుల లెక్కలను సేకరిస్తోంది. ఈ రెండేళ్లలో దాదాపు 12 వేల మంది ఉద్యోగులు రిటైరయ్యారు. దాని ప్రకారమే 1 శాతం ఫిట్‌మెంట్‌కు రూ.225 కోట్లు అవుతుందని అంచనా. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో శాఖల వారీగా మంజూరైన పోస్టుల ప్రకారం లెక్కిస్తే 1 శాతం ఫిట్‌మెంట్‌కు రూ.300 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లెక్కన 30 శాతం ఫిట్‌మెంట్‌కు ప్రభుత్వం ఏటా రూ.9 వేల కోట్లు అదనంగా వెచ్చించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు