విద్యార్థుల ఆత్మహత్య ఘటన.. భువనగిరి హాస్టల్‌ ఎదుట ఉద్రిక్తత

4 Feb, 2024 09:08 IST|Sakshi

సాక్షి, యాదాద్రి: భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడటంతో ఎస్సీ బాలికల హాస్టల్‌ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. బాలికల బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను హత్య చేశారంటూ బాలికల బంధువులు ఆరోపించారు.

హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్‌ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. స్నేహితులైన వీరిద్దరూ తమను వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్‌లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థినులు నలుగురు.. పాఠశాల పీఈటీకి ఫిర్యాదు చేశారు. ఆమె హాస్టల్‌ వార్డెన్‌ శైలజకు సమాచారం ఇచ్చారు. ఆమె భవ్య, వైష్ణవిలను మందలించడంతో పాటు హాస్టల్‌లో జూనియర్, సీనియర్‌ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అంతేగాకుండా భవ్య, వైష్ణవిల తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా సమాచారం చేరవేశారు.

విషయం బయటకి తెలియడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం సాయంత్రం వీరి గదిలో ఉండే ఇతర విద్యార్థినులు ట్యూషన్‌కి వెళ్లగా .. భవ్య, వైష్ణవి మాత్రం తర్వాత వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. అయితే వారిని తీసుకురావాలని ట్యూషన్‌ టీచర్‌ తోటి విద్యార్థినులను గదికి పంపించారు. గదికి వెళ్లిన విద్యార్థినులు తలుపు తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా భవ్య, వైష్ణవి ఫ్యాన్‌కు పాఠశాల యూనిఫాం చున్నీలతో ఉరి వేసుకుని కన్పించారు.

వారు వెంటనే ట్యూషన్‌ టీచర్‌ విషయం చెప్పారు. వార్డెన్, ఇతర సిబ్బంది తలుపు  బలవంతంగా తీసి ఇద్దర్నీ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మరణించారని వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ సీఐ సురేష్‌ కుమార్‌ తెలిపారు.

ఇదీ చదవండి: బాలకృష్ణ కక్కుర్తి‌.. కళ్లు బైర్లు కమ్మేలా..


 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega