చిలీలో కార్చిచ్చు ఎఫెక్ట్‌.. 46 మంది మృతి, వేలాది మందికి.. | Sakshi
Sakshi News home page

Chile Fire: చిలీలో కార్చిచ్చు ఎఫెక్ట్‌.. 46 మంది మృతి, వేలాది మందికి..

Published Sun, Feb 4 2024 8:54 AM

Many People Killed As forest Fires Rage In Central Chile - Sakshi

చిలీ: చిలీలో కార్చిచ్చు కారణంగా 46 మంది మృతి చెందగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్న కారణంగా మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 

వివరాల ప్రకారం.. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో చిలీలో చెలరేగిన కార్చిచ్చు ఇంకా చల్లారలేదు. ఈ కార్చిచ్చులో ఇప్పటివరకు కనీసం 46 మంది మృతిచెందినట్లు అధ్యక్షుడు బోరిక్‌ గాబ్రియెల్‌ శనివారం వెల్లడించారు. వేలాది మంది గాయపడినట్లు తెలిపారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. దాదాపు 1,100 ఇళ్లు మంటల్లో కాలిబూడిదైనట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో సహాయక చర్యలు చేపడుతున్న వారికి సహకరించాలని బోరిక్‌ విజ్ఞప్తి చేశారు.

ఇక, వాల్పరైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు. కార్చిచ్చు కారణంగా మంటలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయని.. వాటిని అదుపు చేసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని అధికారులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, స్వల్ప తేమ కారణంగా మంటలు చెలరేగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిలీ మధ్య, దక్షిణ ప్రాంతాల్లో దాదాపు 92 కార్చిచ్చులు చెలరేగినట్లు మంత్రి కరోలినా వెల్లడించారు. ఇక మంటల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించారు. 

Advertisement
Advertisement